32 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 696.1 కిలోల మాదకద్రవ్యాల నిర్వీర్యం..
ఖమ్మం, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి): మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ఖమ్మం జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు గురువారం భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న గంజాయిని దగ్ధం చేశారు. జిల్లాలోని నాలుగు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో నమోదైన 32 కేసులకు సంబంధించిన 696.1 కిలోల గంజాయిని గోపాలపేటలోని ప్రభుత్వ అనుమతితో ఉన్న నిర్వీర్య కేంద్రంలో నిబంధనల ప్రకారం కాల్చివేశారు. దీని మార్కెట్ విలువ సుమారు రూ.3.50 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ఈ ప్రక్రియను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు పూర్తి చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. ఇటీవల జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో కూడా పలు కేసులు నమోదు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎక్సైజ్ శాఖ పేర్కొంది.

