సంగారెడ్డి, ఆగస్టు 13 (నవజ్యోతి ప్రతినిధి):
ఈ-20 పెట్రోల్ వినియోగంతో ఎదురవుతున్న సమస్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ బొంగుల ఉమారాణి గురువారం పట్టణంలోని ఆటో డ్రైవర్లను కలిసి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆటో డ్రైవర్లు ఈ-20 పెట్రోల్ వినియోగం వల్ల తమ వాహనాల పనితీరులో మార్పులు కనిపిస్తున్నాయని ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
గతంతో పోలిస్తే ఆటోల మైలేజ్ తగ్గుతోందని, ఇంధన వినియోగం పెరిగి రోజువారీ ఖర్చు అధికమవుతోందని డ్రైవర్లు తెలిపారు. కొన్ని వాహనాల్లో ఇంజిన్ పనితీరు సరిగా లేకపోవడం, పికప్ తగ్గడం, స్టార్టింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. పాత మోడల్ ఆటోల్లో ఈ-20 పెట్రోల్ వాడకంపై మరింత ఆందోళన ఉందన్నారు. ఇప్పటికే పెట్రోల్ ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు, విడిభాగాల ధరలతో ఇబ్బందులు పడుతున్న తమకు మైలేజ్ తగ్గితే కుటుంబ పోషణ భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రైవర్ల సమస్యలను విన్న ఉమారాణి మాట్లాడుతూ, ఈ -20 పెట్రోల్ అమలుతో సామాన్య వాహనదారులు, ముఖ్యంగా రోజువారీ ఆదాయంపై ఆధారపడే ఆటో డ్రైవర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ఆటో డ్రైవర్లపై అదనపు ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకోవాలని, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని బొంగుల ఉమారాణి తెలిపారు.

