📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeతెలంగాణవిద్యతోనే కాదు...విలువలతోనూ విజేతలుగా ఎదగాలి

విద్యతోనే కాదు…విలువలతోనూ విజేతలుగా ఎదగాలి

మహీంద్రా యూనివర్సిటీ 5వ కాన్వొకేషన్ ఘనంగా

1309 మందికి డిగ్రీలు – 29 మందికి గోల్డ్ మెడల్స్ 

బహదూర్‌పల్లిలో BEST స్కిల్స్ సెంటర్ ప్రారంభం

కుత్బుల్లాపూర్, ఆగస్టు 2: (నవజ్యోతి ప్రతినిధి) వేగంగా మారుతున్న ప్రపంచంలో విజయాన్ని నిర్ణయించేది కేవలం విద్యార్హతలు కాదని, నిరంతరం నేర్చుకునే తత్వం, మార్పులకు అనుగుణంగా మలుచుకునే సామర్థ్యం, ఉన్నత లక్ష్యాల పట్ల అంకితభావమేనని ప్రముఖ పారిశ్రామికవేత్తలు పిలుపునిచ్చారు. బహదూర్‌పల్లిలోని మహీంద్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆదివారం నిర్వహించిన 5వ వార్షిక కాన్వొకేషన్ ఈ సందేశానికే వేదికగా నిలిచింది.

 

ఈ కాన్వొకేషన్‌లో మొత్తం 1309 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయగా, విద్యా రంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన 29 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, ప్రముఖ విద్యావేత్తల సమక్షంలో వేడుక అత్యంత వైభవంగా జరిగింది.

కార్యక్రమానికి బజాజ్ ఆటో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ముఖ్య అతిథిగా, యూసీ శాన్ డియాగో (అమెరికా) ఛాన్సలర్ ప్రదీప్ కె. ఖోస్లా గౌరవ అతిథిగా హాజరయ్యారు. మహీంద్రా యూనివర్సిటీ ఛాన్సలర్ ఆనంద్ మహీంద్రా అధ్యక్షత వహించగా, వైస్ ఛాన్సలర్ డాక్టర్ యజులు మెడూరి, బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సభ్యులు, అధ్యాపకులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.

‘అద్భుతాల యుగంలో అడుగుపెడుతున్న తరం’

ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ, 2026 బ్యాచ్ విద్యార్థులు ప్రపంచం అత్యంత వేగంగా మారుతున్న కాలంలో తమ విద్యను పూర్తిచేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే అద్భుతాలు ఇప్పుడు ప్రతి ఏడాది జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయని, అలాంటి ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే మార్పులకు అనుగుణంగా పరిణామం చెందే సామర్థ్యంతో పాటు మానవీయ విలువలు, అంతర్గత బలం, ఉన్నత లక్ష్యస్ఫూర్తి అత్యవసరమని అన్నారు. మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థుల్లో ఈ రెండు లక్షణాలను పెంపొందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

‘డిగ్రీ కంటే నేర్చుకునే తత్వమే గొప్పది’

ముఖ్య అతిథి రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం వ్యాపార నమూనాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో పోటీతత్వంలో నిలవాలంటే ఏం తెలుసు అన్నదానికంటే, ఎంత వేగంగా నేర్చుకుంటారు, మార్పులకు ఎలా అనుగుణంగా మారతారు, నేర్చుకున్నదాన్ని ఎలా అమలు చేస్తారు అన్నదే కీలకమని చెప్పారు. లోతైన అవగాహన, క్రమశిక్షణ, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే ధైర్యం విజయానికి మూలమని పేర్కొంటూ, మహీంద్రా యూనివర్సిటీ పట్టభద్రులు నాణ్యత, జిజ్ఞాస, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణల పట్ల అంకితభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

 

నైపుణ్యాల పెంపుకే కొత్త అడుగు

కాన్వొకేషన్ సందర్భంగా బజాజ్ ఇంజినీరింగ్ స్కిల్స్ ట్రైనింగ్ (BEST) సెంటర్ను ప్రారంభించారు. ఇంజినీరింగ్ విద్యార్థుల్లో పరిశ్రమలకు అవసరమైన ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యంగా యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. పరిశ్రమ–విద్యా రంగాల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది.

ప్రతిభకు స్వర్ణ సత్కారం

విద్యా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 29 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల విజయాలను చూసి తల్లిదండ్రులు, అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేయగా, క్యాంపస్ మొత్తం పట్టభద్రుల సంబరాలతో కళకళలాడింది.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, విశ్వవిద్యాలయ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని పట్టభద్రులను అభినందించారు. కొత్త తరం ప్రపంచ సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటూ దేశాభివృద్ధికి తోడ్పడాలని అతిథులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!