ఆగస్టు 20న జరిగే సమావేశానికి సమగ్రంగా సిద్ధం కావాలి: ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
హైదరాబాద్, ఆగస్టు 1 (నవజ్యోతి ప్రతినిధి):
ఈ నెల 20న తమిళనాడులోని మహాబలిపురంలో జరగనున్న దక్షిణ మండలి (సదర్న్ జోనల్ కౌన్సిల్) సమావేశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించనున్న అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో తెలంగాణ తరఫున ప్రతిపాదించాల్సిన అంశాలను పరిశీలించిన ఆయన, రాష్ట్రానికి సంబంధించిన అంతర్రాష్ట్ర, ప్రాంతీయ ప్రాధాన్య అంశాలను గుర్తించి అజెండాలో చేర్చాలని ప్రణాళిక శాఖ అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖలు తమ పరిధిలోని అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి పూర్తి వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు.
పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారానికి వేగం పెంచాలని, రెండు రోజుల్లోగా అన్ని శాఖలు తమ సమాధానాలు, ప్రతిపాదనలు సమర్పించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. తెలంగాణ తరఫున సమర్పించాల్సిన సిఫార్సులు, నివేదికలను సమన్వయంతో సిద్ధం చేసి అనంతరం ముఖ్యమంత్రి పరిశీలనకు పంపాలని తెలిపారు.
ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, శబ్యసాచి ఘోష్, గౌరవ్ ఉప్పల్, ఈ. శ్రీధర్, క్రిస్టినా జోంగ్తుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దక్షిణ మండలి సమావేశానికి సంబంధించిన సన్నాహాలు, శాఖల వారీగా చేపడుతున్న చర్యలను వారు ప్రధాన కార్యదర్శికి వివరించారు.

