సంగారెడ్డి, ఆగష్టు 01 (నవజ్యోతి న్యూస్) :
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టియుడబ్ల్యూ జే-ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ తొలి కార్యవర్గ సమావేశం సోమవారం సదాశివపేటలో జరుగుతుందని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఆర్ అనిల్ కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్, ప్రధాన కార్యదర్శి బసవేశ్వర్ శనివారం తెలిపారు. జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉన్నదని వారు అన్నారు.
గత నెల 9వ తేదీన సంగారెడ్డిలో జిల్లా మహాసభ ను జర్నలిస్టుల ఆకాంక్షలకు అనుగుణంగా పెద్ద ఎత్తున నిర్వహించినట్లు వారు చెప్పారు. జిల్లా నలు మూలల నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులు హాజరైనందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా దశాబ్దాలుగా తమ సంఘం పనిచేస్తున్నదని వారు వివరించారు. వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయించడంతోపాటు… వాటిని మండల స్థాయి గ్రామీణ జర్నలిస్టులకు కూడా ప్రభుత్వం ఇచ్చే విధంగా పోరాటం చేశామన్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో… నేడు తెలంగాణలో కూడా జర్నలిస్టుల అభివృద్ధికి, సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్న సంఘం గా ఉన్నామని బండారు యాదగిరి వివరించారు. సదాశివపేటలో సోమవారం జరిగే జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఏ కే పైసల్ హాజరవుతున్నారని వివరించారు.
ఈ సమావేశంలో అనేక విషయాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలం సాధించేందుకు చర్చిస్తామని అన్నారు. అదేవిధంగా ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డు మంజూరు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ని నియోజకవర్గస్థాయి కమిటీల ఏర్పాటు గురించి చర్చిస్తామని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమము, అభివృద్ధికి సంబంధించిన ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో కార్యాచరణ ప్రకటించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి పేర్కొన్నారు. కార్యవర్గ సభ్యులు సకాలంలో హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

