హైదరాబాద్, జూలై 31 (నవజ్యోతి న్యూస్): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ రాజకీయాలకు, రాష్ట్ర ఉద్యమ చరిత్రకు తీరని లోటని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చురుకైన పాత్ర పోషించి ప్రజల విశ్వాసాన్ని పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారని సీఎం అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపుతూ ప్రజా జీవితంలో ఆదర్శంగా నిలిచారని తెలిపారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించిన ముఖ్యమంత్రి, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆశయాలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

