- రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి.
- సుమారు 2–3 ఏళ్ల ఆడ చిరుతగా గుర్తింపు
- NTCA మార్గదర్శకాల ప్రకారం పోస్టుమార్టం, ఖననం
- వన్యప్రాణుల రక్షణకు మూడు అండర్‌పాస్‌ల నిర్మాణానికి ఆమోదం: డీఎఫ్‌వో.
రామాయంపేట,జూలై 26 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) :
రామాయంపేట – మెదక్ రహదారిపై ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది.రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని తోనిగండ్ల బీట్ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న సుమారు 2 నుంచి 3 సంవత్సరాల వయస్సు గల ఆడ చిరుత పులిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది.సమాచారం అందుకున్న జిల్లా అటవీశాఖ అధికారి ఎం.జోజీ, రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి విద్యాసాగర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు హైవే పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు జిల్లా అటవీ అధికారి తెలిపారు.
మృతిచెందిన చిరుతకు అర్బన్ పార్క్ లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (National Tiger Conservation Authority–NTCA) మార్గదర్శకాల ప్రకారం ఖననం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అడవి జంతువులు సురక్షితంగా రహదారులు దాటేందుకు మెదక్–రామాయంపేట హైవే వెంట మూడు అండర్‌పాస్‌ల నిర్మాణానికి ఇప్పటికే ఆమోదం లభించిందని, వాటి నిర్మాణం పూర్తయితే వన్యప్రాణుల రక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని డీఎఫ్‌వో ఎం.జోజి తెలిపారు.

