అదుపులోకి ఇద్దరు అనుమానితులు.. నకిలీ ముద్రతో 12 దరఖాస్తుల వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు
కామారెడ్డి, జులై 24 (నవజ్యోతి ప్రతినిధి):
ప్రభుత్వ సాధారణ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న వైద్యాధికారి డాక్టర్ చందరి సంతోష్ సంతకం, ఆసుపత్రి అధికారిక ముద్రను నకిలీ చేసి కళ్యాణలక్ష్మి దరఖాస్తులు సమర్పించిన ఘటనలో పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఓ అంతర్జాల సేవా కేంద్రం నిర్వాహకుడు ప్రభుత్వ సంక్షేమ పథకం కింద అక్రమంగా లబ్ధి పొందేందుకు డాక్టర్ సంతోష్ పేరుతో 12 కళ్యాణలక్ష్మి దరఖాస్తులను సిద్ధం చేసి తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దరఖాస్తులు భాగీరథిపల్లి, ఇస్సన్నపల్లి, రామేశ్వర్‌పల్లి గ్రామాలకు చెందినవిగా తేలింది.ఒకేసారి 12 దరఖాస్తులు రావడం, అన్నింటిపైనా ఒకే వైద్యుడి సంతకం ఉండటంతో అనుమానం వచ్చిన రెవెన్యూ అధికారులు డాక్టర్ సంతోష్‌ను సంప్రదించగా, తాను అలాంటి ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేయలేదని స్పష్టం చేశారు.
దీంతో తన సంతకం, అధికారిక ముద్రను దుర్వినియోగం చేశారని పేర్కొంటూ డాక్టర్ సంతోష్ జులై 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కామారెడ్డి టౌన్ ఎస్సై రేణిగుంట సాయికృష్ణ భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఐ నరహరి పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు జులై 23న భిక్కనూరు మండల కేంద్రంలో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నకిలీ సంతకాలు, అధికారిక ముద్రలతో ప్రభుత్వ పథకాలను మోసం చేసేందుకు జరిగిన ఈ వ్యవహారం జిల్లాలో కలకలం రేపింది.

