📄 ePaper
Wednesday, August 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్విజయవంతంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ భుజానికి శస్త్రచికిత్స !

విజయవంతంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ భుజానికి శస్త్రచికిత్స !

‘డ్రాగన్‌’ షూటింగ్‌లో గాయపడిన ఎన్టీఆర్‌.. 2–3 నెలల్లో పూర్తిగా కోలుకునే అవకాశం

హైదరాబాద్‌, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): ప్రముఖ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ భుజానికి బుధవారం హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో ఆర్థ్రోస్కోపిక్‌ శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో వెల్లడించింది.

జూలై 27న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్‌’ సినిమా షూటింగ్‌లో భాగంగా యాక్షన్‌ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఎన్టీఆర్‌ భుజానికి గాయమైంది. గాయాన్ని వైద్యులు పరీక్షించిన అనంతరం 6 నుంచి 8 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం ఇచ్చారు.

వైద్యుల బృందం శస్త్రచికిత్స

గాయం అనంతరం వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఎన్టీఆర్‌కు త్వరగా, పూర్తిస్థాయిలో కోలుకునేందుకు ఆర్థ్రోస్కోపిక్‌ శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ణయించారు. కిమ్స్‌ ఆస్పత్రిలో డాక్టర్‌ ఆర్‌.ఏ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్‌ నితిన్‌ బెజ్జంకి, డాక్టర్‌ మధుసూదన్‌రావు, డాక్టర్‌ శ్రీనివాస్‌రావు సూరపనేని నేతృత్వంలోని ఆర్థోపెడిక్‌ వైద్యుల బృందం శస్త్రచికిత్స నిర్వహించింది.

శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతమైందని, ఎన్టీఆర్‌ ప్రస్తుతం బాగానే ఉన్నారని కిమ్స్‌ వైద్యులు తెలిపారు.

ఇకపై వైద్యుల పర్యవేక్షణలో క్రమబద్ధమైన పునరావాస చికిత్స తీసుకోనున్నారు. సాధారణ స్థితికి పూర్తిగా చేరుకునేందుకు 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు అంచనా వేశారు.

‘డ్రాగన్‌’ షూటింగ్‌కు విరామం

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్‌’లో నటిస్తున్నారు. భుజం గాయం కారణంగా ఈ సినిమా తదుపరి షూటింగ్‌ షెడ్యూల్‌పై ప్రభావం పడింది. అయితే పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన తిరిగి షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

ఎన్టీఆర్‌ భుజానికి గాయం కావడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైనప్పటికీ.. శస్త్రచికిత్స విజయవంతం కావడం, వైద్యులు పూర్తిస్థాయి కోలుకునే అవకాశం ఉందని చెప్పడంతో అభిమానులకు ఊరట లభించింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!