📄 ePaper
Wednesday, August 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్జైలు ఖైదీలకు విద్యతో కొత్త దారి !

జైలు ఖైదీలకు విద్యతో కొత్త దారి !

ఎన్‌ఐఓఎస్‌ ద్వారా 78 మంది ఖైదీలు ఎస్సెస్సీ ఉత్తీర్ణత.. ప్రత్యేక రిమిషన్‌ ప్రకటించిన డీజీ సౌమ్య మిశ్రా

హైదరాబాద్‌, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): తెలంగాణ జైళ్ల శాఖ చరిత్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ (ఎన్‌ఐఓఎస్‌) ద్వారా తొలిసారిగా 78 మంది ఖైదీలు పదో తరగతి (ఎస్సెస్సీ) పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. చెర్లపల్లి, నిజామాబాద్‌ కేంద్ర కారాగారాలు, హైదరాబాద్‌ ప్రత్యేక మహిళా జైలుకు చెందిన ఖైదీలు ఇందులో ఉన్నారు.

ఎన్‌ఐఓఎస్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం మేరకు 108 మంది ఖైదీలను పదో తరగతి కోర్సులో చేర్పించారు. ఏడాది పాటు తరగతులు, మాక్‌ టెస్టులు, ప్రీ-బోర్డు పరీక్షలతో వారికి ప్రత్యేక శిక్షణ అందించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు అవసరమైన చోట ప్రైవేటు ఉపాధ్యాయులను జైళ్ల శాఖ నియమించింది.

78 మంది ఖైదీల విజయ ప్రస్థానం
  • చెర్లపల్లి కేంద్ర కారాగారం: 56 మంది
  • నిజామాబాద్‌ కేంద్ర కారాగారం: 15 మంది
  • హైదరాబాద్‌ ప్రత్యేక మహిళా జైలు: 7 మంది

ఉపాధి, భవిష్యత్‌ జీవనోపాధికి ఉపయోగపడే డేటా ఎంట్రీ ఆపరేటర్‌ తదితర అంశాలను కూడా విద్యార్థులకు అందించారు.

విజయవంతమైన ఖైదీలకు జైళ్ల శాఖ డీజీ డాక్టర్‌ సౌమ్య మిశ్రా సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. విద్య ద్వారా జీవితంలో మార్పు తీసుకురావాలన్న వారి పట్టుదల అభినందనీయమన్నారు. చదువు లేకపోవడం వల్ల గతంలో ఆత్మవిశ్వాసం కోల్పోయామని కొందరు ఖైదీలు పేర్కొన్నారు. ఓ ఖైదీ ఎల్‌ఎల్‌బీ వరకు చదివి, పేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ప్రత్యేక రిమిషన్‌

ఎస్సెస్సీ ఉత్తీర్ణులైన 78 మంది ఖైదీలకు ప్రోత్సాహకంగా డీజీ ప్రత్యేక రిమిషన్‌ ప్రకటించారు. ఉత్తీర్ణులైన వారిని ఎన్‌ఐఓఎస్‌ ద్వారా ఇంటర్‌ (10+2) విద్య కొనసాగించేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. మరో 47 మంది ఖైదీలు ఇప్పటికే ఎస్సెస్సీ విద్యకు కొత్తగా నమోదు చేసుకున్నారని వెల్లడించారు.

ఇంటర్‌ పూర్తి చేసిన అనంతరం చెర్లపల్లి కేంద్ర కారాగారంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌ ద్వారా డిగ్రీ విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే ఉత్తీర్ణులైన 78 మంది చెర్లపల్లి కేంద్ర కారాగారంలోని ఐటీఐలో సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు అభ్యసించి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.

విద్యతో మార్పు.. నైపుణ్యాలతో ఉపాధి..

ఖైదీలను విద్య, ఉన్నత చదువులు, సాంకేతిక నైపుణ్యాల వైపు ప్రోత్సహించడం ద్వారా పునరావాసం, సామాజిక పునరేకీకరణకు మార్గం సుగమం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఐఓఎస్‌ అధికారులు, జైళ్ల శాఖ ఐజీ వై. రాజేశ్‌, డీఐజీలు డి. శ్రీనివాస్‌, ఎం. సంపత్‌, చెర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌ జి. ప్రమోద్‌, నిజామాబాద్‌ జైలు సూపరింటెండెంట్‌ పి. అశోక్‌కుమార్‌, హైదరాబాద్‌ ప్రత్యేక మహిళా జైలు సూపరింటెండెంట్‌ లక్ష్మీ శ్రీనాథ్‌తో పాటు జైళ్ల శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!