సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదించిన కామారెడ్డి టౌన్ పోలీసులు !
కామారెడ్డి, జూలై 19 (నవజ్యోతి ప్రతినిధి):
అసూయతో ఓ మహిళను రాయితో కొట్టి హత్య చేసిన కేసును కామారెడ్డి టౌన్ పోలీసులు శాస్త్రీయ దర్యాప్తుతో ఛేదించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని అరెస్ట్ చేసి, కేసుకు సంబంధించిన కీలక వివరాలను డీఎస్పీ ఆదివారం వెల్లడించారు.
పోతారం గ్రామానికి చెందిన నర్సాపురం రాజం ఈ ఏడాది మే 31న తన భార్య శ్యామల కనిపించడం లేదని టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూలి పనుల కోసం ఇద్దరూ కామారెడ్డికి రాగా, భర్త పనికి వెళ్లగా శ్యామలకు పని దొరకలేదు. కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి రావాలని చెప్పి వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో భర్త ఫిర్యాదు చేశాడు.
జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో టౌన్ సీఐ బి. నరహరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. జూన్ 3న గ్రీన్ సిటీ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించగా, కుటుంబ సభ్యులు దానిని శ్యామలగా గుర్తించారు. తలపై తీవ్ర గాయాలు ఉండటంతో కేసును హత్యగా మార్చి విచారణ కొనసాగించారు.
దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన పోలీసులు జూలై 17న కామారెడ్డి లేబర్ అడ్డా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం శిరాన్‌పల్లికి చెందిన పిట్ట నర్సింలు అలియాస్ పిట్టల నర్సింలును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శ్యామలతో తనకు పరిచయం ఉందని, ఆమెకు డబ్బులు ఇస్తూ ఉండేవాడినని, ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి అసూయతో గ్రీన్ సిటీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రాయితో తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్‌ను రూ.200కు విక్రయించి ఆ డబ్బుతో మద్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు.
విచారణలో నిందితుడిపై గతంలో నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్‌లో దోపిడీ కేసు, బాసర పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదై ఉండగా, బెయిల్‌పై బయట ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో “మామిడి రాజన్న” పేరుతో సంచరించినట్లు కూడా తేలింది.
ఈ కేసును శాస్త్రీయ పద్ధతిలో ఛేదించిన టౌన్ సీఐ బి. నరహరి, ఏఎస్ఐ రంగారావు, పోలీసు సిబ్బంది కమలాకర్, రామస్వామి, సంపత్, రాజులను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర అభినందించారు. కొత్త పరిచయాల వ్యక్తులతో నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లొద్దని, కూలి పనులకు వెళ్లేవారు తమ వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేయాలని, అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే డయల్-112కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

