పెండింగ్ భత్యాలు, బకాయి బిల్లులు విడుదల చేయాలి: ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య
వికారాబాద్, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి): తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రెండవ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ప్రకటించి, పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాల బకాయిలను విడుదల చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి సుదర్శన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాఖ్య 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయంలో జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో చారిత్రక అవసరంగా ఏర్పడిన సమాఖ్య, ఉపాధ్యాయుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని వారు తెలిపారు. ఎన్నికల హామీలో పేర్కొన్న విధంగా పాత పింఛను విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు మూడేళ్లుగా వేతన సవరణ కోసం ఎదురుచూస్తున్నారని, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరు కరువు భత్యాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ఉద్యోగి నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టపోతున్నారని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి వేతన సవరణ సంఘం నివేదికను బహిర్గతం చేసి అమలు చేయాలని, పెండింగ్ కరువు భత్యాలు, ఇతర బకాయి బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండలాల బాధ్యులు, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

