*ఏజీ ఆఫీస్ హౌసింగ్ సొసైటీ భూమి ఆక్రమణ – ఆందోళనలో సభ్యులు*
మేడ్చల్, ఆగష్టు 18(నవజ్యోతి ప్రతినిధి )
అతవెల్లి గ్రామంలో ఏజీ ఆఫీస్ హౌసింగ్ కో-ఆపరేటివ్ సొసైటీకి చెందిన సుమారు 91 ఎకరాల భూమిలో సర్వే నంబర్లు 160, 161 మధ్య వివాదం కొనసాగుతోంది.ఈ భూమిని అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని సొసైటీ చైర్మన్ మొహమ్మద్ ఉస్మాన్ ఆరోపించారు.తమ సొసైటీకి చెందిన భూమిలో కొంత భాగాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని, అక్కడ ఫెన్సింగ్ పనులు చేపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.మంగళవారం సైతం ఫెన్సింగ్ పనులు చేస్తుండగా తాము గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి పనులు నిలిపివేశారని తెలియజేశారు. కాగా ఇదే విషయమై గతంలో సైతం
జూన్ 24న పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఏడీ (AD) సర్వేకు ఆదేశించారని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ సర్వే ఇంకా పెండింగ్‌లోనే ఉందని ఉస్మాన్ వెల్లడించారు.
మండల్ సంజీవ అనే వ్యక్తి తమ సొసైటీపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, మరియు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ తమను బెదిరిస్తున్నారని చైర్మన్ ఆరోపించారు. తాము ప్రభుత్వ ఉద్యోగులమని, తమ సొసైటీ భూమిని వెంటనే సర్వే చేయించి, హద్దులు నిర్ణయించి, ఆక్రమణల నుంచి రక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మరియు డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని, సాధ్యమైనంత త్వరగా న్యాయం చేయాలని ఉస్మాన్ డిమాండ్ చేస్తున్నారు.

