భిక్కనూరులో తల్లిపాల వారోత్సవాలు.. ఆరోగ్యకరమైన భవిష్యత్‌కు తల్లిపాలే పునాది
భిక్కనూరు, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి):
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా భిక్కనూరు మండల కేంద్రంలో గురువారం తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బల్యాల రేఖా సుదర్శన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బల్యాల రేఖా సుదర్శన్ మాట్లాడుతూ, నవజాత శిశువులకు తల్లిపాలు అమృతంతో సమానమని అన్నారు. పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువులకు రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడుతుందని తెలిపారు. తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే అందించాలని, ప్రతి తల్లి ఈ విషయంలో అవగాహనతో వ్యవహరించాలని సూచించారు.
అంగన్‌వాడీ సూపర్వైజర్ మంగ తల్లిపాల ప్రాముఖ్యత, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శిశువుల పోషణపై వివరించారు. ఏఎన్‌ఎం కూడా తల్లిపాల వల్ల తల్లి, బిడ్డ ఇద్దరికీ కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించి, అపోహలను నమ్మవద్దని సూచించారు.
కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

