ట్రాన్స్ఫార్మర్ల తర్వాత బోరు మోటర్ల కేబుళ్లే లక్ష్యం.. వరుస చోరీలతో రైతుల్లో ఆందోళన…
భిక్కనూరు, ఆగస్టు 5 (నవజ్యోతి ప్రతినిధి):
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో విద్యుత్ శాఖ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలు జరుగుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే గుజ్జకుంట, బస్వాపూర్, పెద్ద మల్లారెడ్డి గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల లో రాగి తీగలు చోరీకి గురైన ఘటనలు కలకలం రేపగా, తాజాగా రామేశ్వర్పల్లి గ్రామంలో బోరు మోటర్ల విద్యుత్ కేబుళ్లను కత్తిరించి దుండగులు ఎత్తుకెళ్లారు.
గ్రామంలోని సామల రాజిరెడ్డి బావి నుంచి ఏనుగు భూపతి బావి వరకు ఉన్న 14 బోరు మోటర్ల విద్యుత్ కేబుళ్లను రాత్రి వేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు కత్తిరించి చోరీ చేసినట్లు రైతులు తెలిపారు. దీంతో సాగునీటి సరఫరా నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత కొంతకాలంగా మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ శాఖ ఆస్తులనే లక్ష్యంగా చేసుకుని చోరీలు జరుగుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ల తర్వాత ఇప్పుడు బోరు మోటర్ల కేబుళ్లను కూడా లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరంగా మారిందని పేర్కొంటున్నారు. విద్యుత్ శాఖకు నష్టం వాటిల్లడంతో పాటు రైతుల వ్యవసాయ కార్యకలాపాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రజలు, పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. గ్రామ శివార్లు, వ్యవసాయ క్షేత్రాల వద్ద రాత్రివేళల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. విద్యుత్ శాఖ కూడా తన ఆస్తుల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుని, చోరీకి గురైన ప్రాంతాల్లో త్వరితగతిన విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల సహకారం, అధికారుల అప్రమత్తతతోనే ఇలాంటి వరుస చోరీలకు అడ్డుకట్ట వేయవచ్చని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

