హైదరాబాద్, ఆగస్టు 4 (నవజ్యోతి): భారతీయ సాంకేతిక విద్యాసంస్థ (ఐఐటీ) హైదరాబాద్, క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్‌పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా దేశంలోనే తొలి పరిశ్రమ–విద్యాసంస్థల భాగస్వామ్య అణు సాంకేతిక శిక్షణ కార్యక్రమం ‘అనుగ్యాన్ – న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ (NTOP)’ను ప్రారంభించాయి. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర అణుశక్తి రంగానికి అవసరమైన నైపుణ్యవంతులైన ఇంజినీర్లను తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
మూడు నెలల రెసిడెన్షియల్ శిక్షణలో రియాక్టర్ ఫిజిక్స్, థర్మల్ హైడ్రాలిక్స్, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు (SMRs), అణు భద్రత, క్వాలిటీ అష్యూరెన్స్, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (AERB) నిబంధనల అనుసరణ, సిమ్యులేటర్ ఆధారిత శిక్షణ వంటి అత్యాధునిక అంశాలను బోధించనున్నారు. ఇంజినీరింగ్ పట్టభద్రులు, పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు ఈ కోర్సులో పాల్గొనే అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి మాట్లాడుతూ, స్వచ్ఛ ఇంధన రంగంలో దేశ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య మానవ వనరులను తీర్చిదిద్దడంలో ‘అనుగ్యాన్’ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. క్రిమ్సన్ ఎనర్జీ న్యూక్లియర్ విభాగం అధ్యక్షుడు కమోడోర్ (రిటైర్డ్) ఆర్.డి. మానే మాట్లాడుతూ, అణుశక్తి రంగంలో భద్రత, నాణ్యత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. 2047 నాటికి దేశ అణుశక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు విస్తరించాలనే జాతీయ లక్ష్యానికి ఈ కార్యక్రమం తోడ్పడనుంది.

