📄 ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అర్ధరాత్రి బీభత్సం.. టీచర్స్ కాలనీ జలదిగ్బంధం

అర్ధరాత్రి బీభత్సం.. టీచర్స్ కాలనీ జలదిగ్బంధం

ఇళ్లలోకి వరద నీరు.. రోడ్లపై నదిని తలపించిన ప్రవాహం.. అర్ధరాత్రి 2 గంటలకు పోలీసుల సహాయక చర్యలు…

అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షంతో కామారెడ్డి పట్టణంలోని టీచర్స్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా 148.8 మిల్లీమీటర్ల వర్షపాతం కామారెడ్డిలో నమోదవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. టీచర్స్ కాలనీలోకి భారీగా వరద నీరు చేరి ఇళ్లలోకి చొచ్చుకుపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

రోడ్లపై నదిని తలపించిన వరద ప్రవాహం

కాలనీలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరగా, ప్రధాన రహదారులపై నదిని తలపించేలా నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. కొన్ని ప్రాంతాల్లో నడుము లోతు వరకు నీరు చేరడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

అర్ధరాత్రి 2 గంటలకు రంగంలోకి దిగిన పోలీసులు

పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నీటిలో చిక్కుకున్న చిన్నారులు, మహిళలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రజలకు సహాయం అందించారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి

గతంలో కూడా భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి టీచర్స్ కాలనీ వరద ముంపునకు గురైందని స్థానికులు తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పటికీ ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

డ్రైనేజీల సామర్థ్యం పెంచాలని డిమాండ్

కాలనీ లోతట్టు ప్రాంతంలో ఉండటంతో పాటు వర్షపు నీటి పారుదల వ్యవస్థ సరిగా లేకపోవడం, డ్రైనేజీలు, నాలాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి కాకపోవడం వల్ల ప్రతి భారీ వర్షానికీ ముంపు సమస్య పునరావృతమవుతోందని స్థానికులు చెబుతున్నారు. వర్షపు నీటి పారుదల వ్యవస్థను విస్తరించడం, నాలాలను అభివృద్ధి చేయడం, డ్రైనేజీల సామర్థ్యాన్ని పెంచడం వంటి శాశ్వత చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

టీచర్స్ కాలనీతో పాటు పట్టణంలోని మరికొన్ని లోతట్టు ప్రాంతాల్లోనూ నీరు నిలిచిపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో పోలీసులు, మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!