సంగారెడ్డి, ఆగస్టు 03 (నవజ్యోతి ప్రతినిధి) :
– మున్సిపల్ వైస్ చైర్మన్ హాఫీజ్ షేక్ షఫీ
సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన హాఫీజ్ షేక్ షఫీని ఆయన గురువు, కెనడాలోని ఎడ్మంటన్ నగరంలోని అల్ ఫజర్ ఇస్లామిక్ సెంటర్ అధ్యక్షుడు, మస్జిద్-ఎ-కుబా ఇమామ్ ముఫీ మొహమ్మద్ ఇమ్రాన్ ఫారూఖ్ శాలువాతో సత్కరించి అభినందించారు. వైస్ చైర్మన్ పదవికి ఆయన ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొంటూ, సమాజ సేవ పట్ల చూపిన అంకితభావం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు ఇది లభించిన గుర్తింపని కొనియాడారు.
అల్లాహ్ కరుణతో హాఫీజ్ షేక్ షఫీ తన బాధ్యతలను న్యాయబద్ధంగా, నిష్పాక్షికంగా నిర్వహించి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను చేపట్టాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో నిజాయితీ, నిర్ణయాల్లో దృఢత్వం, సేవలో అంకితభావంతో మున్సిపాలిటీ అభివృద్ధికి, సమాజంలో ఐక్యత, శాంతి, శ్రేయస్సు పెంపొందించేందుకు కృషి చేయాలని దువా చేశారు. ఆయన సేవలు ప్రజలకు ఉపయోగపడటంతో పాటు ఈ లోకంలోనూ, పరలోకంలోనూ మంచి ఫలితాలను అందించాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా హాఫీజ్ షేక్ షఫీ మాట్లాడుతూ, తన గురువు అందించిన ఆశీస్సులు, శుభాకాంక్షలు జీవితాంతం మరువలేనివని అన్నారు. గురువు మార్గదర్శకత్వం తన ప్రజాసేవా ప్రయాణానికి మరింత స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శకంగా, న్యాయబద్ధంగా విధులు నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు. గురువుల ఆశీస్సులు, పెద్దల సలహాలు తనకు ఎల్లప్పుడూ దిక్సూచిలా నిలుస్తాయని, సంగారెడ్డి అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రహీమ్, హాజీ సాహెబ్, నూమాన్, షహీద్, రఫీక్ ఖాన్, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.

