📄 ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రభుత్వ పథకాల అమలులో శాఖల సమన్వయం కీలకం !

ప్రభుత్వ పథకాల అమలులో శాఖల సమన్వయం కీలకం !

 

ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాల పర్యవేక్షణకు సమగ్ర డ్యాష్‌బోర్డు, స్పీడ్ సెల్ ఏర్పాటు.. అధికారులకు ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాలు…

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే అన్ని శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. సోమవారం వివిధ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ప్రభుత్వ పథకాల అమలుపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

డ్యాష్‌బోర్డు, స్పీడ్ సెల్ ఏర్పాటు

ప్రభుత్వ పథకాల లక్ష్యాలు, పురోగతి, అమలు స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా సమగ్ర డ్యాష్‌బోర్డు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అలాగే పథకాల అమలును నిరంతరం సమీక్షించేందుకు ప్రత్యేకంగా “స్పీడ్ సెల్” ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

సీఎం సమీక్షకు సిద్ధంగా ఉండాలి

త్వరలో ముఖ్యమంత్రి అన్ని శాఖల కార్యదర్శులతో సమగ్ర సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఫ్లాగ్‌షిప్ పథకాల అమలు, శాఖల విజయాలు, భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర ప్రాయోజిత పథకాలపై పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. శాఖలు చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, ఉత్తమ విధానాలు, విజయగాథలను కూడా నివేదికల్లో పొందుపరచాలని సూచించారు.

టీ-ఫైబర్, విజన్–2047పై దృష్టి

రాష్ట్రంలోని గ్రామపంచాయతీలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ-ఫైబర్ కనెక్టివిటీ పూర్తి చేయాలని, ప్రభుత్వ విజన్–2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి శాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. కేంద్ర నిధుల విడుదలలో జాప్యం లేకుండా వినియోగ ధ్రువీకరణ పత్రాలు, ప్రాజెక్టు ప్రతిపాదనలు, అవసరమైన నివేదికలను సకాలంలో సమర్పించాలని అధికారులకు ఆదేశించారు.

ఖేలో ఇండియా ఏర్పాట్లపై సమీక్ష

నవంబర్ 14 నుంచి రాష్ట్రంలో నిర్వహించనున్న ఖేలో ఇండియా క్రీడల ఏర్పాట్లను కూడా ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. 26 క్రీడాంశాల్లో 11 వేదికలపై జరిగే ఈ పోటీలకు 7 వేల మందికి పైగా క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులు హాజరుకానున్న నేపథ్యంలో అవసరమైన కమిటీలను ముందుగానే ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

కాలుష్య నియంత్రణ, పంటల వైవిధ్యీకరణ

ప్రధాన పట్టణాల్లో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు డీజిల్ ఆటోరిక్షాలను విద్యుత్ ఆధారిత వాహనాలుగా మార్చే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే ఎల్‌నినో ప్రభావంతో వరి సాగుపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై విస్తృత అవగాహన కల్పించి, పంటల వైవిధ్యీకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!