సదాశివపేట, ఆగస్టు 3 (నవజ్యోతి ప్రతినిధి):
– జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం..,
జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీఎస్‌యూడబ్ల్యూజే–ఐజేయూ) రాజీలేని పోరాటం కొనసాగిస్తోందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కే. ఫైసల్ అన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం, హెల్త్ కార్డు, అక్రిడిటేషన్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని సంక్షేమ హక్కులు సాధించే వరకు సంఘం పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
సదాశివపేటలో సోమవారం జరిగిన టీఎస్‌యూడబ్ల్యూజే–ఐజేయూ సంగారెడ్డి జిల్లా కార్యవర్గ తొలి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫైసల్, నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘంలో పదవి అనేది గౌరవ సూచిక మాత్రమే కాదని, సభ్యులు అప్పగించిన బాధ్యత అని పేర్కొన్నారు. బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, జర్నలిస్టుల కోసం అంకితభావంతో పనిచేసే నాయకులకే భవిష్యత్తులో మరింత గుర్తింపు, అవకాశాలు లభిస్తాయని అన్నారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సంఘ ప్రయోజనాల కోసం పనిచేసే వారే నిజమైన నాయకులని ఫైసల్ పేర్కొన్నారు. సేవా దృక్పథం, నిబద్ధత, పారదర్శకతతో పనిచేసిన వారిని సంఘం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని, పదవులు సేవకు ప్రతిఫలంగా రావాలని, లక్ష్యంగా మారకూడదని సూచించారు.
జర్నలిస్టుల హెల్త్ కార్డుల జారీ, అక్రిడిటేషన్ కార్డుల మంజూరు, పెండింగ్ సంక్షేమ పథకాల అమలు, అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర నాయకత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం అన్ని స్థాయిల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
జిల్లా శాఖ మరింత బలోపేతం కావాలంటే ప్రతి సభ్యుడు సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, జర్నలిస్టులంతా ఐక్యంగా ఉంటేనే హక్కుల సాధన వేగవంతమవుతుందని ఫైసల్ పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి అధ్యక్షత వహించగా, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల జర్నలిస్టులు పాల్గొన్నారు.

