ప్రజా సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందించిన ప్రభుత్వ సలహాదారు.. అధికారులకు ఆదేశాలు
హైదరాబాద్, ఆగస్టు 3 (నవజ్యోతి ప్రతినిధి):
బిక్కనూరు మండలానికి సంబంధించిన పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీని హైదరాబాద్లో కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
సిద్ధరామేశ్వర దేవాలయం రహదారి వద్ద బ్రిడ్జి పక్కనున్న సర్వీస్ రోడ్డును వెంటనే పునరుద్ధరించాలని నాయకులు కోరగా, షబ్బీర్ అలీ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా బిక్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని కోరుతూ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతిపత్రం అందజేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాల్యల సుదర్శన్, సిద్ధరామేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ తాటిపాముల లింబాద్రి, ఉప సర్పంచ్ దుంపల మోహన్ రెడ్డి, మండల మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు ద్యాగాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

