తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ సభ్యత్వ ప్రకటనతో చర్చ..
అయితే పూర్తి స్థాయి సబ్‌స్క్రిప్షన్ సేవలు 2027కే అంటూ స్పష్టీకరణ
హైదరాబాద్, ఆగస్టు 2 (నవజ్యోతి ప్రతినిధి):
తెలంగాణలో సోషల్ మీడియా వేదికగా ఉచితంగా వాతావరణ అప్‌డేట్లు, భారీ వర్షాల హెచ్చరికలు అందిస్తూ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తెలంగాణ వెదర్‌మ్యాన్ టి.బాలాజీ ప్రకటించిన నెలకు రూ.100 సభ్యత్వ విధానం చర్చనీయాంశమైంది. అయితే ఈ ప్రకటనపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన మరోసారి స్పందిస్తూ ప్రస్తుతం చెల్లింపు సేవలను ప్రారంభించడం లేదని, పూర్తి స్థాయి సబ్‌స్క్రిప్షన్ ప్లాట్‌ఫారమ్‌ను 2027 వర్షాకాలం నాటికి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
మొదట సభ్యత్వ ప్రకటన..
ప్రారంభంలో విడుదల చేసిన వివరాల ప్రకారం వ్యక్తిగత వినియోగదారులకు నెలకు రూ.100 చందాతో వాట్సాప్ ద్వారా లోకేషన్ ఆధారిత వాతావరణ సమాచారం, ప్రత్యేక హెచ్చరికలు, వ్యక్తిగత కన్సల్టేషన్ వంటి సేవలు అందించనున్నట్లు బాలాజీ ప్రకటించారు. అలాగే వ్యవసాయం, నిర్మాణం, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వంటి రంగాలకు ప్రత్యేక కార్పొరేట్ ప్యాకేజీలను కూడా రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.
చర్చకు కారణమైన ప్రకటన
ఈ ప్రకటన వెలువడిన తర్వాత సోషల్ మీడియాలో విస్తృత చర్చ మొదలైంది. ఇప్పటివరకు అందరికీ ఉచితంగా అందుబాటులో ఉన్న వాతావరణ సమాచారం భవిష్యత్తులో చందాదారులకు మాత్రమే పరిమితం అవుతుందా? అత్యవసర వర్ష హెచ్చరికల్లో కూడా చెల్లింపు చేసిన వారికే ప్రాధాన్యం ఉంటుందా? అనే ప్రశ్నలు వినిపించాయి. ప్రజల విశ్వాసంతో ఎదిగిన వేదిక ఇప్పుడు వాణిజ్య సేవల దిశగా అడుగులు వేస్తుందా అనే చర్చ కూడా సాగింది.
తర్వాత వివరణ ఇచ్చిన బాలాజీ
ఈ నేపథ్యంలో బాలాజీ మరో ప్రకటన విడుదల చేశారు. కొత్త సంస్థ ఏర్పాటు, చట్టపరమైన ప్రక్రియలు, చార్టర్డ్ అకౌంటెంట్లు, న్యాయ నిపుణులు, వెబ్ డెవలపర్లు, వ్యాపార సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. పూర్తి స్థాయి చెల్లింపు సేవలను ప్రారంభించేందుకు అవసరమైన సాంకేతిక వేదిక, బ్యాక్‌ఎండ్ వ్యవస్థ, చట్టపరమైన ప్రక్రియలు పూర్తవ్వడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉందని వెల్లడించారు.
ప్రస్తుతం ఉచిత అప్‌డేట్లే
వర్షాకాలం సగం పూర్తయిన ఈ సమయంలో ప్రజలు కీలకమైన వాతావరణ సమాచారాన్ని కోల్పోకుండా ఉండేందుకు ప్రస్తుతం అప్పుడప్పుడు ఉచిత వాతావరణ అప్‌డేట్లను కొనసాగిస్తామని బాలాజీ స్పష్టం చేశారు. అదే సమయంలో భవిష్యత్తు సబ్‌స్క్రిప్షన్ సేవల కోసం అవసరమైన సాంకేతిక వేదిక అభివృద్ధిపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
2027 నాటికి పూర్తి స్థాయి ప్లాట్‌ఫారమ్
వాతావరణ సమాచారంతో పాటు మరికొన్ని అనుబంధ సేవలను కూడా అందించేలా కొత్త ప్లాట్‌ఫారమ్‌ను రూపొందిస్తున్నామని, 2027 వర్షాకాలం నాటికి పూర్తి స్థాయి సభ్యత్వ సేవలను ప్రారంభించే లక్ష్యంతో పని చేస్తున్నామని బాలాజీ వెల్లడించారు.
చెల్లింపులపై స్పష్టత
గత రెండు రోజులుగా తమకు వచ్చిన ఈ-మెయిళ్లకు సంబంధించి ఎలాంటి చెల్లింపులు స్వీకరించలేదని, ఎవరికి కూడా గూగుల్ ఫారం లేదా పేమెంట్ క్యూఆర్ కోడ్ పంపలేదని బాలాజీ స్పష్టం చేశారు. తమ పేరుతో ఎవరైనా డబ్బులు అడిగినా లేదా చెల్లింపులు కోరినా నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
ప్రజల్లో భిన్నాభిప్రాయాలు
ఒకవైపు వాతావరణ డేటా సేకరణ, విశ్లేషణ, సర్వర్ల నిర్వహణ, సాంకేతిక బృందం వంటి అంశాలకు ఖర్చు ఉంటుందని, అందుకే సభ్యత్వ విధానం సహజమైన వ్యాపార నిర్ణయమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు భారీ వర్షాలు, వరదలు, పిడుగులు వంటి ప్రజల ప్రాణాలకు సంబంధించిన అత్యవసర హెచ్చరికలు మాత్రం ఎలాంటి చందా పరిమితులు లేకుండా అందరికీ సమానంగా చేరాలని పలువురు కోరుతున్నారు.
చూడాల్సింది ఇదే..
ప్రస్తుతం పూర్తి స్థాయి చెల్లింపు సేవలు అమల్లోకి రావడం లేదని బాలాజీ స్పష్టత ఇవ్వడంతో తొలి ప్రకటనపై వచ్చిన అనుమానాలకు కొంతవరకు తెరపడింది. అయితే 2027లో ప్రారంభం కానున్న సభ్యత్వ విధానం ఎలా ఉండబోతోంది? ఉచిత సేవలు ఏ స్థాయిలో కొనసాగుతాయి? ప్రీమియం సేవల్లో ఎలాంటి అదనపు సౌకర్యాలు ఉంటాయి? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.

