జెనీవాలో జరిగే యూత్ ఎంపవర్‌మెంట్ ఫోరమ్–2026కు ఎంపిక
ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ కళాశాల (సికింద్రాబాద్)లో బీఏ (ఈపీపీ) మొదటి సంవత్సరం చదువుతున్న దక్షిణ సూడాన్ విద్యార్థి పాల్ కువోట్ గరాంగ్ మంగువాక్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశం లభించింది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో సెప్టెంబర్ 3 నుంచి 6 వరకు జరిగే యూత్ ఎంపవర్‌మెంట్ ఫోరమ్ (YEF)-2026లో పాల్గొనేందుకు ఆయన ఎంపికయ్యారు.
150 దేశాల ప్రతినిధులతో వేదిక
కెనడాకు చెందిన సెంటర్ ఫర్ గ్లోబల్ డైలాగ్ అండ్ లీడర్‌షిప్ (CGDL) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ అంతర్జాతీయ వేదికలో 150కు పైగా దేశాల నుంచి యువ నాయకులు, విద్యార్థులు, నిపుణులు, పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు. పాల్‌కు Partially Funded Delegate కేటగిరీలో ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది.
ప్రత్యేక సౌకర్యాలు
ఈ ఎంపిక ద్వారా వసతి, భోజనం, అధికారిక సమావేశాల్లో పాల్గొనే అవకాశం, అంతర్జాతీయ సంస్థల సందర్శన, నాయకత్వ ధ్రువీకరణ పత్రం, ప్రపంచవ్యాప్తంగా యువ నాయకులతో నెట్‌వర్కింగ్ అవకాశాలు లభించనున్నాయి. అలాగే 1,000 అమెరికన్ డాలర్ల SDGs Action Grant కోసం పోటీపడే అవకాశాన్ని కూడా ఆయన పొందనున్నారు.
ఓయూ నుంచి ఎన్‌ఓసీ
ఫోరమ్‌లో పాల్గొనేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ వ్యవహారాల కార్యాలయం పాల్‌కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేసింది. అనంతరం ఆయన అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ ప్రొఫెసర్ బి. విజయను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
అభినందించిన ప్రొఫెసర్ విజయ
ఈ సందర్భంగా ప్రొఫెసర్ బి. విజయ పాల్‌ను అభినందిస్తూ, అంతర్జాతీయ వేదికపై ఉస్మానియా విశ్వవిద్యాలయానికి, దక్షిణ సూడాన్‌కు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువత అంతర్జాతీయ వేదికల్లో పాల్గొని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.

