చిన్నారి చికిత్సకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు..
తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల యాదిరెడ్డి తమ్ముడి కుమార్తె భవిష్యకు విజయవంతంగా మైనర్ శస్త్రచికిత్స పూర్తికావడంతో, కోలుకున్న చిన్నారితో కలిసి కుటుంబ సభ్యులు నంది నగర్లోని కేటీఆర్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఆరోగ్యంపై ఆరా
ఈ సందర్భంగా చిన్నారి ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తిగా కోలుకుని చదువుల్లో రాణించాలని భవిష్యకు ఆకాంక్షలు తెలిపారు.
ఇచ్చిన హామీ మేరకు చికిత్స
గత నెల మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామంలో యాదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా చిన్నారి భవిష్య ఆరోగ్య సమస్య గురించి తెలుసుకున్న కేటీఆర్, మెరుగైన వైద్య చికిత్స అందేలా పార్టీ తరఫున అవసరమైన ఏర్పాట్లు చేయాలని నాయకులకు సూచించారు. ఇచ్చిన హామీ మేరకు చికిత్స పూర్తయ్యేలా సహకరించినందుకు కుటుంబ సభ్యులు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
సబితా ఇంద్రారెడ్డి హాజరు
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.

