📄 ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మరో మూడు రోజులు వానలే.. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ...

మరో మూడు రోజులు వానలే.. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ …

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాల సూచన.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక..

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ జిల్లాలకు హెచ్చరిక

సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్ధిపేట, జనగాం, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్‌తో పాటు మరికొన్ని జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

రైతులకు ఊరట

ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పలు జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తుండగా, గ్రామాల్లో ప్రత్యేక పూజలు, కప్పతల్లి ఆటలు నిర్వహించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా మారుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశముండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

వాగులు, వంకలకు మళ్లీ జలకళ

గత నాలుగు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువుల్లోకి నీరు చేరుతోంది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రమే వర్షాలు నమోదవగా, మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా ఆశించిన స్థాయిలో వర్షపాతం లేదు. తాజా అంచనాలతో రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాలకు మంచి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్‌కు ఉపశమనం

ఆదివారం ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బంది పడిన హైదరాబాద్ నగరవాసులకు సాయంత్రం కురిసిన వర్షం ఊరటనిచ్చింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, పంజాగుట్ట, బోయిన్‌పల్లి, ఈసీఐఎల్, కాచిగూడ, మలక్‌పేట్, ఉప్పల్, మణికొండ తదితర ప్రాంతాల్లో మంచి వర్షం కురిసింది. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.

జాగ్రత్తలు పాటించాలి

పిడుగులు పడే అవకాశాలు ఉన్న సమయంలో చెట్ల కింద నిలబడకుండా, బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. అలాగే రైతులు, ప్రజలు తాజా వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

© 2026 నవజ్యోతి తెలుగు దినపత్రిక. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!