సంగారెడ్డి, జూలై 24 (నవజ్యోతి ప్రతినిధి):
సంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియను తక్షణమే చేపట్టి, పాఠశాలల్లో ఏర్పడిన ఉపాధ్యాయుల కొరతను నివారించాలని కోరుతూ తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీటీయూ జిల్లా అధ్యక్షుడు పి. ప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో పాటు కొందరు ఉపాధ్యాయులపై అదనపు పని భారం పడుతున్నందున విద్యాబోధన ప్రభావితమవుతోందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే అవసరమైన పాఠశాలల్లో నిబంధనలకు అనుగుణంగా వర్క్ అడ్జస్ట్మెంట్ చేపట్టాలని కోరారు. యూనియన్ సహాధ్యక్షుడు బట్టు నర్సింహా రాజు మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, నిబంధనల మేరకు పారదర్శకంగా ఉపాధ్యాయుల సర్దుబాట్లు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను సానుభూతితో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని డీఈఓను కోరారు. ఈ కార్యక్రమంలో టీటీయూ నాయకులు ప్రభుదాస్తో పాటు పలువురు ఉపాధ్యాయులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

