- మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు, పార్టీ-ప్రభుత్వ సమన్వయంపై విస్తృత చర్చ
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సమన్వయ కమిటీ సమావేశం ఈసారి హైదరాబాద్‌కు బదులుగా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, కీలక రాజకీయ నిర్ణయాలపై కాంగ్రెస్ అధిష్ఠానం అభిప్రాయం తీసుకోవడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా భావిస్తున్నారు.
ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, ఖాళీగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. సామాజిక, ప్రాంతీయ సమతుల్యతకు ప్రాధాన్యం ఇస్తూ నియామకాలు చేపట్టాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో బీసీ వర్గాలకు ప్రాధాన్యం కల్పించే అంశంపై కూడా సమాలోచనలు జరిగినట్లు తెలిసింది. అలాగే మైనార్టీ వర్గానికి చెందిన కీలక నాయకుడిని ఎమ్మెల్సీగా ఎన్నిక చేయించి అనంతరం మంత్రివర్గంలో అవకాశం కల్పించే అంశం కూడా చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదం అనంతరం వెలువడే అవకాశమున్నట్లు సమాచారం.
పార్టీ, ప్రభుత్వ వ్యవస్థల మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపర్చడంపై కూడా సమావేశంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, మంత్రులు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎంత మేర చురుకుగా పనిచేస్తున్నారనే అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై కూడా సమీక్ష జరిగింది. అర్హులైన ప్రతి ఓటరిని నమోదు చేయించే దిశగా మండల, గ్రామ స్థాయి నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా పనిచేయాలని పార్టీ నాయకత్వం సూచించినట్లు సమాచారం.రాబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపైనా సమావేశంలో చర్చించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో సంప్రదించి ఒక్కో స్థానానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లను అధిష్ఠానానికి పంపించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఇంటింటి ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ నాయకత్వం కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం.

