ఆఫీస్‌కు వెళ్లి బయటకు వచ్చిన భావన.. ఉద్యోగం కాదు, ఉద్యోగులపై వేధింపులే సమస్యంటూ ఆరోపణ ( అప్డేటెడ్ )
హైదరాబాద్, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): టెక్ మహీంద్రా ఉద్యోగి ఆర్. భావన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కంపెనీ సూచన మేరకు బహదూర్‌పల్లి కార్యాలయానికి వెళ్లిన ఆమె.. సంస్థ ప్రతినిధులతో మాట్లాడి అనంతరం బయటకు వచ్చారు.
కంపెనీ తనను ఆగస్టు 10న సమావేశానికి పిలిచినట్లు కాకుండా ఉద్యోగానికి రావాలని పిలిచిందని భావన తెలిపారు. అయితే తన సమస్య ఉద్యోగం కాదని, ఉద్యోగులపై జరుగుతున్న వేధింపులు, అన్యాయాలపై తాను ప్రశ్నిస్తున్నానని ఆమె స్పష్టం చేశారు.
టెక్ మహీంద్రా బహదూర్‌పల్లి, హైటెక్ సిటీ కార్యాలయాలతో పాటు హైదరాబాద్ లేబర్ కమిషన్ పరిధిలో ఉద్యోగుల సమస్యలకు సంబంధించి చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని భావన ఆరోపించారు. హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో కూడా ఇలాంటి సమస్యలను పరిష్కరించినట్లు స్పష్టమైన దాఖలాలు కనిపించడం లేదని ఆమె పేర్కొన్నారు.
మీడియాకు పంపిన ఆరు డిమాండ్లను కంపెనీ పరిష్కరించాలని తాను కోరుతున్నట్లు భావన తెలిపారు. అందులో రెండు వ్యక్తిగత డిమాండ్లు కూడా ఉన్నాయని, వాటిని పరిష్కరించడంతో పాటు తనను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.
ఇప్పటికే 22 రోజులు గడిచినా సమస్య పరిష్కారం కాకుండా మళ్లీ మొదటి నుంచి వివరాలు అడుగుతున్నారని, మరోసారి డాక్యుమెంట్లు పంపించాలని కంపెనీ కోరుతోందని భావన ఆరోపించారు. ఈ ప్రక్రియలో తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని ఆమె వ్యాఖ్యానించారు.
తన డిమాండ్ల పరిష్కారం కోసం ఆగస్టు 14న ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు భావన తెలిపారు. నిరాహార దీక్ష కూడా చేపడతానని, తన డిమాండ్లు నెరవేరే వరకు దీక్ష కొనసాగిస్తానని చెప్పారు.
తన పోరాటం కేవలం టెక్ మహీంద్రా సంస్థకు మాత్రమే పరిమితం కాదని భావన తెలిపారు. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలను బయటపెట్టి, వారికి న్యాయం జరిగేలా పోరాడాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు.
న్యాయం జరిగేంత వరకు కాళ్లకు చెప్పులు ధరించకుండా, జుట్టు ముడి వేయకుండా ఉంటానని భావన శపథం చేశారు. తన డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
కంపెనీ పంపిన ఈమెయిల్‌లో భావన ఇప్పటికీ టెక్ మహీంద్రా సంస్థలో యాక్టివ్ ఉద్యోగిగానే ఉన్నారని, ఆమె ఫిర్యాదుపై సంస్థ అంతర్గత విచారణ ప్రారంభించినట్లు పేర్కొంది. విచారణ అనంతరం కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వెల్లడికావాల్సి ఉంది.

