ప్రాణ రక్షణకు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి
భిక్కనూరు, జూలై 30 (నవజ్యోతి ప్రతినిధి):
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భిక్కనూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ సూచించారు. పాడైపోయిన లేదా పగుళ్లు ఉన్న ఇళ్లలో ఉండరాదని, అత్యవసర పరిస్థితులు మినహా బయటకు వెళ్లవద్దని తెలిపారు.
విద్యుత్ స్థంభాలు, తెగిపోయిన విద్యుత్ వైర్లు, బోర్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని, వాగులు, వంతెనలు, నదులు పొంగిపొర్లుతున్న సమయంలో నడిచి లేదా వాహనాలతో దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో తిరగవద్దని, చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు బయటకు వెళ్లకుండా చూడాలని కోరారు.
తాగునీటిని మరిగించి మాత్రమే వినియోగించాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈత కొట్టేందుకు, చేపలు పట్టేందుకు లేదా సెల్ఫీల కోసం వరద ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలను ప్రమాదంలో పడేయొద్దని హెచ్చరించారు. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండి అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ అనిల్ విజ్ఞప్తి చేశారు.

