తుక్కుగూడ, ఆగస్టు 31 (నవజ్యోతి ప్రతినిధి):
హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో 21 ఏళ్ల నర్సు దారుణ హత్యకు గురైంది. నెల రోజులుగా ఆమె కదలికలను గమనిస్తూ వచ్చిన ఓ బైక్ మెకానిక్.. లైంగిక దాడికి యత్నించగా ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఎండీ సనావుల్లాను పహాడీషరీఫ్ పోలీసులు ఫిర్యాదు అందిన 30 గంటల్లోనే అరెస్టు చేశారు.
మృతురాలు సుమారు ఏడు నెలల క్రితం తన స్నేహితురాలు కాకా సారికతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్సుగా చేరారు. ఇద్దరూ ఆస్పత్రి క్వార్టర్స్‌లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
గదిలోనే మృతదేహం
ఆగస్టు 29న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నర్సు ఉదయం నుంచి గది నుంచి బయటకు రాకపోవడంతో సారిక ఆమె అత్తకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నిసార్లు తలుపు తట్టినా స్పందించకపోవడంతో బంధువులు కిటికీలో నుంచి చూడగా గదిలో ఆమె మృతదేహం కనిపించింది. ముఖంపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆస్పత్రికి సమీపంలోని బైక్ మెకానిక్ షాపులో పనిచేసే సనావుల్లా సుమారు నెల రోజులుగా నర్సు కదలికలను గమనించినట్లు దర్యాప్తులో తేలిందని షమ్షాబాద్ జోన్ డీసీపీ బి.రాజేశ్ తెలిపారు. ఆమెపై లైంగిక ఆసక్తి పెంచుకున్న నిందితుడు దాడికి పథకం వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అర్ధరాత్రి కిటికీలో నుంచి ప్రవేశం
ఆగస్టు 29న అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో నిందితుడు కిటికీలో నుంచి నర్సు గదిలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మేల్కొని కేకలు వేయడంతో నిందితుడు నోరు మూసి, గొంతు పట్టుకున్నాడని చెప్పారు.
ఆమె ప్రతిఘటిస్తూ నిందితుడి చిటికెన వేలిని కొరకడంతో పాటు గోళ్లతో గొంతు, ఛాతిపై గాయాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడు ఆమెపై దాడి చేసి గొంతు నులిమినట్లు పేర్కొన్నారు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత లైంగిక దాడికి పాల్పడి కిటికీ నుంచే పరారైనట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు.
సాంకేతిక ఆధారాలతో నిందితుడి గుర్తింపు
కేసు నమోదు అనంతరం పోలీసులు సాంకేతిక ఆధారాలు, ఇతర దర్యాప్తు సమాచారాన్ని విశ్లేషించి నిందితుడిని గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. ఆగస్టు 30 సాయంత్రం అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి శాంసంగ్ మొబైల్ ఫోన్, దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరిన్ని శాస్త్రీయ, ఫోరెన్సిక్, సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు.
ఈ ఘటనపై పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 554/2026గా భారతీయ న్యాయ సంహితలోని 103(1), 64(1), 332(a) సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టంలోని 3(ii)(V) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కేసులో మరిన్ని ఆధారాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.
30 గంటల్లో అరెస్టు
పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్ పర్యవేక్షణలో, డీసీపీ బి.రాజేశ్, ఆర్జీఐఏ డివిజన్ ఏసీపీ వి.శ్రీకాంత్‌గౌడ్ మార్గదర్శకత్వంలో పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణరెడ్డి, ఆయన బృందం, షమ్షాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదు అందిన 30 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నర్సు హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినప్పటికీ దర్యాప్తు కొనసాగుతోంది. హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుడి కదలికలు, సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు ఆధారంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

