📄 ePaper
Thursday, September 3, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు స్పీడ్‌!

తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు స్పీడ్‌!

17 ప్రాజెక్టులు.. 2,023 కి.మీ. | రూ.50,870 కోట్ల అంచనా వ్యయం
17
రైల్వే ప్రాజెక్టులు
2,023 కి.మీ.
ప్రాజెక్టుల పరిధి
₹50,870 కోట్లు
అంచనా వ్యయం

హైదరాబాద్‌, ఆగస్టు 31 (నవజ్యోతి ప్రతినిధి):
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు సోమవారం సమీక్ష నిర్వహించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్‌రాజ్‌, నవీన్‌ మిట్టల్‌, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

రాష్ట్రంలో 2,023 కి.మీ. మేర 17 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రూ.50,870 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌లు రైల్వే బోర్డుకు సమర్పించినట్లు అధికారులు సీఎస్‌కు వివరించారు. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సమస్యలు, భూసేకరణ, వివిధ శాఖల అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన సహకారంపై సమావేశంలో చర్చించారు.

21 పెండింగ్‌ అంశాలపై ఫోకస్‌

రైల్వే అండర్‌పాస్‌లు, ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణం, అప్రోచ్‌ రోడ్లు, రహదారుల విస్తరణ, రైల్వే లైన్ల డబ్లింగ్‌, చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు ప్రజా రవాణా కనెక్టివిటీ వంటి సుమారు 21 అంశాలను సమావేశంలో సమీక్షించారు.

దక్షిణ మధ్య రైల్వే అధికారులతో కలిసి సంబంధిత శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించి పెండింగ్‌ సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని సీఎస్‌ ఆదేశించారు.

ఫ్యూచర్‌ సిటీ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఫ్యూచర్‌ సిటీ, ఔటర్‌ రింగ్‌ రోడ్‌, రీజినల్‌ రింగ్‌ రోడ్‌ పరిధుల్లో రైల్వే లైన్ల విస్తరణకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎస్‌ సూచించారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే మౌలిక సదుపాయాలను ముందుగానే అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పీఎం గతిశక్తి నిధులపై దృష్టి

కేంద్ర ప్రభుత్వ పీఎం గతిశక్తి కార్యక్రమం కింద నిధులు పొందేందుకు సమగ్ర డీపీఆర్‌లు సిద్ధం చేయాలని సంజయ్‌ జాజు ఆదేశించారు.

హైదరాబాద్‌ భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎంఎంటీఎస్‌ విస్తరణ, ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాంతాల్లో రైల్వే టెర్మినళ్ల ఏర్పాటుపై ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. భవిష్యత్‌ రైల్వే కనెక్టివిటీ, బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్లకు అవసరమైన భూసేకరణను కూడా ముందుగానే పరిశీలించాలని ఆదేశించారు.

శాఖల మధ్య సమన్వయంతో వేగం

మున్సిపల్‌ పరిపాలన, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు, రెవెన్యూ, ఇంధన, రోడ్లు–భవనాల శాఖలు దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సీఎస్‌ సూచించారు.

రైల్వే ప్రాజెక్టుల అమలుకు అవసరమైన సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిర్ణీత కాలంలో ప్రాజెక్టులు పూర్తయ్యేలా నిరంతర సమన్వయం కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ భవిష్యత్‌ రవాణాకు కీలకం

రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక, ప్రాంతీయ అభివృద్ధికి రైల్వే కనెక్టివిటీ కీలకమని సీఎస్‌ పేర్కొన్నారు. ప్రాజెక్టులలో ఉన్న పెండింగ్‌ సమస్యలను వేగంగా పరిష్కరించి రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి. కర్ణన్‌, టీజీఐఐసీ ఎండీ శశాంక, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్‌, పలు జిల్లాల కలెక్టర్లు, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!