📄 ePaper
Sunday, August 16, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రేవంత్‌ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.. హరీశ్‌రావు ఫైర్‌ !

రేవంత్‌ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.. హరీశ్‌రావు ఫైర్‌ !

రుణమాఫీపై సవాల్‌.. గన్‌మెన్లు లేకుండా నీ ఊరికి వస్తా: హరీశ్‌రావు

సిద్దిపేట, ఆగస్టు 15 (నవజ్యోతి ప్రతినిధి):

సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి రోత మాటలు మాట్లాడి ఉండరని అన్నారు. గాంధీ, పటేల్‌, నెహ్రూ లాంటి మహనీయులను తలచుకోవాల్సిన రోజున రేవంత్‌ రెడ్డి చిల్లర రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు.

‘420 మాటలే మాట్లాడారు’

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చారని, సంగారెడ్డి సభలో ముఖ్యమంత్రి సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు ప్రసంగం ప్రారంభించి, పూర్తిగా 420 మాటలే మాట్లాడారని హరీశ్‌రావు అన్నారు. నాడు కేసీఆర్‌ ఆగస్టు 15న అభివృద్ధి, సాగునీరు, విద్యుత్‌ గురించి మాట్లాడేవారని, కానీ రేవంత్‌ రెడ్డి సంగారెడ్డిలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం గురించి కూడా చెప్పలేదన్నారు.

మెదక్‌, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు తాగునీరు అందించే సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేశారని ఆరోపించారు. నేడు నారాయణఖేడ్‌ తదితర ప్రాంతాల్లో రెండు, మూడు రోజులకు ఒకసారి కూడా నీళ్లు రాని పరిస్థితి నెలకొందన్నారు.

కేసీఆర్‌ సంగారెడ్డి జిల్లా సాగునీటి కోసం ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను ఈ మూడేళ్లలో మూలకు పడేశారని, వాటి గురించి కనీసం ఒక్క ముక్క కూడా సీఎం మాట్లాడలేదన్నారు.

ఉద్యోగాలు, రేషన్‌ కార్డులపై విమర్శలు

ఏడాది క్రితం జహీరాబాద్‌కు వచ్చి కోతలు కోశారని, అందులో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ హయాంలో మంజూరైన మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలు, రోడ్లు తప్ప.. కాంగ్రెస్‌ వచ్చాక కొత్తగా ఒక్క కిలోమీటర్‌ రోడ్డు కూడా వేయలేదన్నారు.

అసెంబ్లీలో కొత్త రేషన్‌ కార్డుల గురించి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో 6,47,479 రేషన్‌ కార్డులు ఇచ్చారని, 20 లక్షల మందికి లబ్ధి చేకూరిందని చెప్పారని తెలిపారు. కానీ సీఎం మాత్రం పబ్లిక్‌ మీటింగ్‌లలో అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్‌ హయాంలో మనిషికి 4 కిలోల బియ్యం, కుటుంబానికి 20 కిలోల సీలింగ్‌ ఉండేదని, కేసీఆర్‌ వచ్చాక సీలింగ్‌ ఎత్తివేసి, మనిషికి 6 కిలోల చొప్పున ఎంత మంది ఉంటే అంత మందికి బియ్యం ఇచ్చిన ఘనత బీఆర్ఎస్‌దేనని అన్నారు.

అసెంబ్లీలో తాను స్వయంగా అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని చెప్పారని, కానీ నాటి సభలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగులను మోసం చేసినందుకు సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఒక ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్‌ గాంధీని తీసుకొచ్చి అశోక్‌ నగర్‌ లైబ్రరీ సాక్షిగా హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ రాహుల్‌ గాంధీ పత్తాలేడని వ్యాఖ్యానించారు. దమ్ముంటే గన్‌మెన్లను వదిలేసి అశోక్‌ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఓయూ దగ్గరికి వస్తారా అని ప్రశ్నించారు.

ఫీజు రీయింబర్స్మెంట్‌పై ఆరోపణలు

గత రెండున్నరేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్‌ ఇవ్వకుండా 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్‌ పెట్టిపోయిన బకాయిలను కూడా బీఆర్ఎస్‌ ప్రభుత్వం చెల్లించిందని, ఇప్పుడు కొత్తగా ఇస్తానంటున్న సీఎం.. గత రెండున్నరేళ్ల బకాయిల సంగతి ఎప్పుడు చెబుతారని ప్రశ్నించారు.

రైతుబంధుపై లెక్కలు చెప్పిన హరీశ్‌రావు

కేసీఆర్‌ ఇచ్చిన దానికంటే ఎక్కువ రైతుబంధు ఇచ్చానని సీఎం అబద్ధాలు ఆడుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. కేసీఆర్‌ ప్రభుత్వం 2022-23లో రూ.14,743 కోట్లు ఇస్తే, రేవంత్‌ రెడ్డి 24-25లో కేవలం రూ.5,557 కోట్లు, 25-26లో రూ.11,000 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. రెండు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి రూ.15 వేల కోట్లు ఎగ్గొట్టారని ఆరోపించారు.

రుణమాఫీపై సవాల్‌

2 లక్షల రుణమాఫీ చేస్తానని దేవుడి మీద ఒట్టు పెట్టి మోసం చేసిన ఘరానా మోసగాడు రేవంత్‌ రెడ్డి అని హరీశ్‌రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో రూ.35 వేల కోట్లు రుణమాఫీ కోసం పెట్టామని చెప్పి, కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని, రూ.15 వేల కోట్లు ఎగ్గొట్టారని ఆరోపించారు.

తన ఛాలెంజ్‌ స్వీకరించే దమ్ముంటే గన్‌మెన్లు లేకుండా తన ఊరికి వస్తావా రేవంత్‌ రెడ్డి అని ప్రశ్నించారు. నీ ఊళ్లో అందరికీ రుణమాఫీ జరిగిందని తేలితే తాను అక్కడే రాజీనామా చేస్తానని, లేదంటే నువ్వు చేస్తావా అని సవాల్‌ విసిరారు.

ఉచిత కరెంట్‌పైనా బహిరంగ చర్చకు సవాల్‌

24 గంటల కరెంట్‌ ఇస్తున్నామని సీఎం గొప్పలు చెబుతున్నారని హరీశ్‌రావు అన్నారు. రాఘవాపూర్‌, నర్సాపూర్‌, బొమ్మల రామారం సబ్‌స్టేషన్లలో తాను స్వయంగా లాగ్‌ బుక్స్‌ పరిశీలించానని తెలిపారు. ఎక్కడ కూడా 10-11 గంటలకు మించి వ్యవసాయానికి త్రీఫేస్‌ కరెంట్‌ రావడం లేదని పేర్కొన్నారు. రుణమాఫీ, ఉచిత కరెంట్‌, ఫీజు రీయింబర్స్మెంట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!