33 జిల్లాల్లో ఒకేసారి ప్రారంభమైన పంపిణీ ప్రక్రియ
ఆగస్టు 15 (నవజ్యోతి ప్రతినిధి):
తెలంగాణలో ఆహార భద్రతను మరింత విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన భారీ సభలో సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. 33 జిల్లాల్లో ఒకేసారి పంపిణీ ప్రక్రియ మొదలైంది.
రాష్ట్రవ్యాప్తంగా 1,06,28,092 స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా 3,42,57,109 మంది ఆహార భద్రత పరిధిలోకి వస్తున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రతి అర్హ లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.14,850 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.
కార్డు కాదు.. ఆకలి భయానికి భరోసా
స్మార్ట్ రేషన్ కార్డు కేవలం గుర్తింపు కార్డు కాదని.. ప్రతి అర్హ కుటుంబానికి ఆహార భద్రత, గౌరవప్రదమైన జీవనానికి ప్రభుత్వ భరోసా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గతంలో రేషన్ దుకాణాల ద్వారా అందించే దొడ్డు బియ్యానికి బదులుగా ప్రజలు ఇష్టంగా తినే నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా 16.32 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసి 61 లక్షలకు పైగా కొత్త లబ్ధిదారులను ఆహార భద్రత పరిధిలోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇంకా అర్హత ఉన్న కుటుంబాలు దరఖాస్తు చేసుకోవచ్చని.. పరిశీలన అనంతరం రేషన్ కార్డులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
రైతు నుంచి పేదవాడి పళ్లెం వరకు
సన్నరకాల వరి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని మంత్రి తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన నాణ్యమైన ధాన్యాన్ని సన్నబియ్యంగా మార్చి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద కుటుంబాలకు అందిస్తున్నామని చెప్పారు.
2025-26లో సుమారు 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందని.. గత మూడు వ్యవసాయ సంవత్సరాల్లో 376.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, సన్నరకాల ధాన్యం బోనస్‌తో కలిపి సుమారు రూ.90,314 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.
సాంకేతిక భద్రతతో స్మార్ట్ కార్డులు
కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల్లో హోలోగ్రామ్, వాటర్‌మార్క్, మైక్రోటెక్స్ట్, యూవీ సెక్యూరిటీ ఫీచర్లు, ఎన్‌క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ తదితర భద్రతా అంశాలను పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. నకిలీ కార్డులు, దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచడమే లక్ష్యమన్నారు. T-Ration యాప్ ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు, ధాన్యం కేటాయింపులు, లావాదేవీలు, రేషన్ దుకాణం వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
రాహుల్ రాముడు.. జగ్గన్న హనుమంతుడు
సంగారెడ్డి సభలో సీఎం రేవంత్‌రెడ్డి స్థానిక రాజకీయాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని రాముడితో, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని హనుమంతుడితో పోల్చారు.
“రాహుల్‌గాంధీ రాముడు అయితే.. జగ్గన్న హనుమంతుడి లాంటి వాడు. ఆ రాముడి మాట ఈ హనుమంతుడు ఎప్పుడూ జవదాటడు” అని రేవంత్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి పోటీ చేయాలా? వద్దా? అనేది ఆయన చేతిలో కూడా లేదని.. ఆ నిర్ణయం రాహుల్‌గాంధీ చేతిలోనే ఉందని స్పష్టం చేశారు.
కేసీఆర్‌కు రేవంత్ సవాల్
సభలో మాజీ సీఎం కేసీఆర్‌పై కూడా రేవంత్‌రెడ్డి విమర్శలు చేశారు. రైతుల సంక్షేమం, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ఫామ్‌హౌస్‌లో ఉండి విమర్శలు చేయకుండా అసెంబ్లీకి వచ్చి చర్చించాలని అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలు ఒకే నాణేనికి రెండు వైపులని విమర్శించారు.
నెహ్రూ, రాజీవ్ విగ్రహాల ఆవిష్కరణ
సంగారెడ్డి పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుందని ప్రభుత్వం పేర్కొంది. ఆకలి, పేదరికం నుంచి ప్రతి కుటుంబానికి విముక్తి కల్పించడమే ఆహార భద్రతకు అసలైన అర్థమని సీఎం, మంత్రి తెలిపారు.

