కృష్ణా, గోదావరికి పుష్కల జలాలు.. సకాలంలో వర్షాల కోసం ప్రార్థనలు
నాగార్జునసాగర్, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి): నైరుతి రుతుపవనాల సీజన్ సగం దాటినా తెలంగాణ జీవనాడులైన కృష్ణా, గోదావరి నదులకు ఇంకా ఆశించిన స్థాయిలో ఎగువ నుంచి నిరంతర ప్రవాహాలు రావాల్సి ఉంది. వర్షపాతం అసమానతలు, రానున్న వారాల్లో రుతుపవనాల తీరుపై అనిశ్చితి నేపథ్యంలో రాష్ట్ర జల భద్రతపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో సోమవారం వరుణ యాగం నిర్వహించనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ యాగంలో పాల్గొననుండగా.. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమల ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు యాగాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణతో పాటు కృష్ణా, గోదావరి నదుల ఎగువ పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని, నదులకు పుష్కలంగా వరద ప్రవాహాలు రావాలని, ప్రాజెక్టులు, చెరువులు నిండాలని, భూగర్భ జలాలు పెరగాలని, రైతులకు మంచి పంటలు పండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నారు.
నాగార్జునసాగర్ జలాశయానికి ప్రస్తుతం ప్రవాహాలు వస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో నీరు చేరలేదు. 312.045 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యానికి గాను 145.65 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. సుమారు 166.39 టీఎంసీల ఖాళీ నిల్వ సామర్థ్యం ఉంది. నీటిమట్టం 518 అడుగుల వద్ద ఉండగా.. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు.
గతేడాది ఆగస్టు 9న సాగర్‌లో 310.25 టీఎంసీల నీరు ఉండగా, నీటిమట్టం 589.40 అడుగులకు చేరింది. అప్పటితో పోలిస్తే ఈసారి సాగర్‌లో సగానికి లోపే నీటి నిల్వ ఉండటం పరిస్థితిని స్పష్టం చేస్తోంది.
కృష్ణా బేసిన్లో ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహాలు పెరుగుతున్నాయి. ఆల్మట్టి ప్రాజెక్టుకు 1,05,332 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 86,155 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌కు సుమారు 42 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 18,654 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి.
తెలంగాణలోకి కృష్ణా ప్రవాహాలకు ప్రధాన ద్వారమైన జూరాలకు సుమారు 80 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 46,543 క్యూసెక్కులు దిగువకు విడుదలవుతున్నాయి. జూరాల వద్ద 9.66 టీఎంసీల సామర్థ్యానికి 8.07 టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయంలో 215.807 టీఎంసీల సామర్థ్యానికి 179.90 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
తెలంగాణ నీటి లభ్యత కేవలం రాష్ట్రంలో కురిసే వర్షాలపైనే ఆధారపడదు. కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాలు మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ విస్తరించి ఉన్నాయి. దీంతో ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలు, ప్రాజెక్టుల నిల్వలు, వరద ప్రవాహాలు తెలంగాణకు కీలకంగా మారాయి.
గోదావరి విషయంలోనూ మహారాష్ట్రలోని నాసిక్, మరాఠ్వాడా తదితర ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలు దిగువకు వచ్చే ప్రవాహాలపై ప్రభావం చూపుతాయి. అందువల్ల ఎగువ పరీవాహక ప్రాంతాల్లో వర్షపాతం, ప్రాజెక్టుల నీటిమట్టాలు, విడుదలలు, నదీ ప్రవాహాలను రాష్ట్ర అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఉంది.
నాగార్జునసాగర్ విజయవిహార్ ప్రాంగణంలో 11 హోమగుండాలతో రోజంతా వరుణ యాగం నిర్వహించనున్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన వేద పండితులు, రుత్వికులు, ఆలయ సిద్ధాంతితో సంప్రదింపుల అనంతరం ఆగస్టు 10ను యాగానికి శుభదినంగా నిర్ణయించారు. మొత్తం 108 మంది రుత్వికులు, అర్చకులు, వేద పండితులు పాల్గొననున్నారు.
వర్షాలు, నదీ ప్రవాహాలు, జలాశయాల నింపుదల కోసం ప్రభుత్వం ఒకవైపు ఆధునిక నీటి నిర్వహణ, వాతావరణ అంచనాలు, ఎగువ ప్రాంతాల పర్యవేక్షణపై దృష్టి పెడుతుండగా.. మరోవైపు వరుణ యాగం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తోంది. ఈ ఏడాది మిగిలిన రుతుపవన కాలం తెలంగాణ జల, వ్యవసాయ అవసరాలకు కీలకంగా మారింది.

