వైన్స్ మూసివేత.. గల్లీల్లో మద్యం జోరు.. నవజ్యోతి రిపోర్టర్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు
కుత్బుల్లాపూర్, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి): బోనాల పండుగ సందర్భంగా మద్యం విక్రయాలపై ఆంక్షలు అమల్లో ఉన్నా.. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుభాష్‌నగర్, రామ్‌రెడ్డినగర్ ప్రాంతాల్లో మద్యం లభ్యతపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక వైన్స్ దుకాణాలు మూతపడిన వేళ.. గల్లీల్లో మాత్రం మద్యం విక్రయాలు సాగుతున్నాయన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో నవజ్యోతి రిపోర్టర్ కెమెరాకు మద్యం సేవిస్తున్న దృశ్యాలు, మద్యం బాటిళ్లు, రాత్రివేళ అనుమానాస్పదంగా సాగుతున్న కార్యకలాపాలు చిక్కాయి.
నవజ్యోతి కెమెరాకు చిక్కిన దృశ్యాలు 📸


సుభాష్‌నగర్‌లోని ఓ ఇరుకైన షెడ్‌లో పలువురు కూర్చొని మద్యం సేవిస్తున్న దృశ్యాలను రిపోర్టర్ కెమెరాలో చిత్రీకరించారు. మరోచోట కూడా రాత్రివేళ పలువురు గుమిగూడి ఉండటం కనిపించింది. ఒక ప్రదేశంలో పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లు ఉండగా.. కిరాణా దుకాణం వద్ద కూడా రాత్రివేళ మద్యం విక్రయాలకు సంబంధించిన అనుమానాస్పద పరిస్థితులు కనిపించాయి.
బోనాల సందర్భంగా అధికారిక మద్యం దుకాణాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఇంత పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు అక్కడికి ఎలా చేరుతున్నాయన్నది ప్రశ్నగా మారింది. బెల్ట్ షాపుల పేరుతో అనధికార విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు నిజమా? మద్యం ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? ఎవరి అండదండలతో ఈ వ్యవహారం సాగుతోంది? అన్న అంశాలపై ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
పండుగ సందర్భంగా అధికారిక దుకాణాలను మూసివేయడం మాత్రమే కాకుండా.. అనధికార మద్యం విక్రయాలను అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉంది. అయితే రిపోర్టర్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు క్షేత్రస్థాయిలో నిఘా ఎంతమేర ఉందన్న ప్రశ్నను లేవనెత్తుతున్నాయి.
సుభాష్‌నగర్, రామ్‌రెడ్డినగర్ ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి మద్యం నిల్వలు, విక్రయాలపై విచారణ చేయాలని స్థానికులు కోరుతున్నారు. బోనాల ఆంక్షల సమయంలో అనధికార మద్యం విక్రయాలు నిజంగా జరుగుతున్నాయా? జరిగితే వాటి వెనుక ఉన్నది ఎవరు? అన్నది అధికారుల తనిఖీల్లో తేలాల్సి ఉంది.

