📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రేవంత్‌ రాకతోనే రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంది !

రేవంత్‌ రాకతోనే రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంది !

గోదావరిలో నీళ్లున్నా రైతులకు కరెంటు, సాగునీరు లేదు.. కాశీ వెళ్లి క్షమాపణ చెప్పాలి: నోముల భగత్‌కుమార్

నాగార్జునసాగర్‌, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి, దేవుళ్లపై ఒట్లు వేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. రైతులు, ప్రజలకు క్షమాపణ చెప్పేందుకు రేవంత్‌రెడ్డి వెంటనే కాశీ వెళ్లి గంగానదిలో పుణ్యస్నానం చేయాలని డిమాండ్‌ చేశారు.

వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని భగత్‌ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో 24 గంటల విద్యుత్‌ సరఫరా చేశామని, ప్రస్తుతం రైతులకు 12 గంటల కరెంటు కూడా సక్రమంగా అందడం లేదన్నారు. తరచూ విద్యుత్‌ అంతరాయాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

గోదావరిలో నీళ్లున్నా.. కాళేశ్వరం పంపులు నడపడం లేదు

గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ కాళేశ్వరం పంపులను నడపకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే పంపులను వినియోగించడం లేదని విమర్శించారు. కాళేశ్వరం పంపులను నడిపి గోదావరి జలాలను ఎత్తిపోస్తే తెలంగాణలోని సగభాగం సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉందన్నారు.

గోదావరి నీటిని ఏపీకి తరలించే ప్రయత్నం

మిగులు జలాల పేరుతో గోదావరి నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని భగత్‌ ఆరోపించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు.

కాళేశ్వరం పంపులు నడిపి సాగునీరు ఇవ్వాలి

కాళేశ్వరం పంపులను వెంటనే నడిపి సాగునీరు అందించాలని, వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని భగత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!