డీఎస్సీ అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి: చల్లా సునీల్
పులివెందుల, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి): 2025లో జరిగిన మెగా డీఎస్సీపై సీబీఐ లేదా స్వతంత్ర సంస్థతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని కడప జిల్లా యువజన విభాగం కార్యనిర్వహక సభ్యులు చల్లా సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పిలుపుతో శనివారం పులివెందుల ఆర్‌డీవో కార్యాలయం వద్ద విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో సునీల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్సీ పరీక్ష విధానంలో అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీల ఆరోపణలతో పలువురు నిరుద్యోగులు నష్టపోయారని అన్నారు. ప్రశ్నాపత్రాల రూపకల్పన నుంచి నియామకాల వరకు జరిగిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు.
డీఎస్సీ అభ్యర్థులకు జరిగిన నష్టానికి నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

