📄 ePaper
Friday, August 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కలెక్టర్‌ పేరును ఊరు పేరుగా మార్చుకుని.. అభిమానం చాటుకున్న గిరిజనులు!

కలెక్టర్‌ పేరును ఊరు పేరుగా మార్చుకుని.. అభిమానం చాటుకున్న గిరిజనులు!

కలెక్టర్‌ చొరవతో ఇంటి స్థల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు.. కృతజ్ఞతగా గ్రామానికి కొత్త పేరు

ఆదిలాబాద్‌, ఆగస్టు 14 (నవజ్యోతి ప్రతినిధి):
పేదరికం.. కనీస వసతుల కొరత.. సొంతింటి కలకు దూరంగా ఉన్న మారుమూల కొలం గిరిజన కుటుంబాలకు అండగా నిలిచిన ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజర్షి షాపై గిరిజనులు తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. దహిగూడ గ్రామం పేరును ‘రాజర్షి షాగూడ’గా మార్చుకున్నారు. కలెక్టర్‌ చొరవతో తమకు ఇంటి స్థల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరై జీవనంలో మార్పు వస్తుండటంతో కృతజ్ఞతగా ఈ పేరు పెట్టుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

మూడు ఇళ్ల గృహప్రవేశాలు

పిప్పలధరి గ్రామపంచాయతీ పరిధిలోని దహిగూడ (రాజర్షి షాగూడ)ను గురువారం కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా పూర్తయిన మూడు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలను స్వయంగా ప్రారంభించారు. గతంలో గ్రామంలోని 17 పేద గిరిజన కుటుంబాలకు ఇంటి స్థల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో మౌలిక వసతులు, ఇళ్ల నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని గ్రామస్థులు తెలిపారు.

మరో 10 ఇళ్లకు మంజూరు

అనంతరం నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్‌ గిరిజనులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ.. పిప్పలధరి గ్రామపంచాయతీ పరిధిలో మరో 10 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

జీవనోపాధికి చేయూత

గిరిజన కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు మేకలు, పాడి గేదెల యూనిట్లు అందిస్తామని కలెక్టర్‌ తెలిపారు. మహిళలకు ఉచిత టైలరింగ్‌ శిక్షణ, డిగ్రీ పూర్తి చేసిన స్థానిక యువతకు ఆదిలాబాద్‌లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

విద్యుత్‌.. నెట్‌వర్క్‌.. రహదారులపై దృష్టి

గ్రామంలో ప్రధాన సమస్యలైన విద్యుత్‌, మొబైల్‌ నెట్‌వర్క్‌, రవాణాపైనా కలెక్టర్‌ వెంటనే స్పందించారు. నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ శాఖ ఈఈని ఆదేశించారు. మొబైల్‌ టవర్‌ నిర్మాణానికి స్థలం గుర్తించాలని సూచించారు. ఆధార్‌ లేని గ్రామస్థులకు వెంటనే ఆధార్‌ నమోదు చేయాలని ఈడీఎం, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.

మామిడికోరి గ్రామానికి రహదారి కనెక్టివిటీ, సీడీ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని, రైతులకు జలసిరి కింద ఫామ్‌ పాండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్‌ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కలెక్టర్‌పై అభిమానం.. గ్రామానికే ఆయన పేరు!

తమ సమస్యలను స్వయంగా విని.. పరిష్కారానికి చొరవ చూపిన కలెక్టర్‌ రాజర్షి షాపై గిరిజనులు చూపిన అభిమానం.. ఏకంగా గ్రామం పేరును ‘రాజర్షి షాగూడ’గా మార్చుకునే స్థాయికి చేరడం ప్రత్యేకంగా నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!