‘అన్నం పెట్టిన వాళ్లను మర్చిపోను.. తల వంచే రాజకీయ నాయకుడిని కాదు’
కామారెడ్డి, ఆగస్టు 13 (నవజ్యోతి ప్రతినిధి):
బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్‌తో కలిసి పనిచేశానని, మంత్రి పదవి లేదా డబ్బు కోసం పార్టీ మారలేదని స్పష్టం చేశారు. అయితే నియోజకవర్గానికి ఇచ్చిన హామీల మేరకు నిధులు విడుదల కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేసీఆర్ హయాంలోనే బాన్సువాడలో అభివృద్ధి జరిగిందని పోచారం అన్నారు. ‘అన్నం పెట్టిన వాడిని మర్చిపోతమా? అలా మర్చిపోతే పుట్టగతులుండవ్’ అంటూ తన రాజకీయ ప్రస్థానంలో కేసీఆర్ చేసిన సహాయాన్ని గుర్తుచేశారు. తాను చెప్పింది ఉన్న విషయమేనని, తన ప్రజలే తనకు ముఖ్యమని పేర్కొన్నారు.
బాన్సువాడలో పెండింగ్ బిల్లులు, అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో నిధులు విడుదల కాలేదని పోచారం తెలిపారు. బిల్లులు రాకపోవడంతో పలు అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు నిలిపివేశారని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ఆశించిన స్పందన రాలేదని ఆరోపించారు.
‘నా ప్రజలే నాకు ముఖ్యం.. వారి కోసమే నా జీవితం. ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తా తప్ప నా స్వార్థం కోసం ఏదీ చేయను. ఏదైనా పోరాటం చేసి సాధించుకుంటా కానీ తల వంచే రాజకీయ నాయకుడిని కాదు’ అని పోచారం స్పష్టం చేశారు.
కేసీఆర్‌ను ప్రశంసిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోచారం చేసిన వరుస వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన భవిష్యత్ రాజకీయ అడుగులపై కూడా చర్చ మొదలైంది.
అయితే ఇప్పటివరకు తాను బీఆర్‌ఎస్‌లోకి తిరిగి వెళ్తానని పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

