📄 ePaper
Friday, August 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఇదిగో కొత్త రేషన్ కార్డుల ఫీచర్లు ఇవే !

ఇదిగో కొత్త రేషన్ కార్డుల ఫీచర్లు ఇవే !

నకిలీ కార్డులకు చెక్‌.. అసలుదనాన్ని సులభంగా గుర్తించేలా రూపకల్పన

హైదరాబాద్‌, ఆగస్టు 13 (నవజ్యోతి ప్రతినిధి):
రాష్ట్రంలో కొత్తగా జారీ చేయనున్న ఆహార భద్రత కార్డులకు పటిష్టమైన భద్రతా ఫీచర్లను
ప్రభుత్వం పొందుపరుస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సమర్థత పెంచడంతోపాటు
నకిలీ కార్డుల తయారీ, అక్రమ వినియోగాన్ని అడ్డుకునేలా కార్డులను రూపొందించారు.
రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ఆగస్టు 15 నుంచి
ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం భద్రతా అంశాలను వెల్లడించింది. ప్రస్తుతం
రాష్ట్రంలో సుమారు 1.60 కోట్ల ఆహార భద్రత కార్డులు ఉండగా..
3.43 కోట్ల మంది లబ్ధిదారులకు వాటి ద్వారా ప్రయోజనం అందుతోంది.

తొమ్మిది రకాల భద్రత

కొత్త కార్డులో మొత్తం తొమ్మిది ప్రత్యేక భద్రతా అంశాలను పొందుపరిచారు.
సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ సంతకం, తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో హోలోగ్రామ్‌,
రిలీఫ్‌ టెక్స్ట్‌, మైక్రో టెక్స్ట్‌, డ్యూయల్‌ హిడెన్‌ ఇమేజ్‌, వాటర్‌మార్క్‌,
అదృశ్య యూవీ లోగో, ఎన్‌క్రిప్టెడ్‌ క్యూఆర్‌ కోడ్‌, గిల్లోష్‌ ప్యాటర్న్‌ ఇందులో ఉన్నాయి.

  • సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ సంతకం
  • తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో హోలోగ్రామ్‌
  • రిలీఫ్‌ టెక్స్ట్‌
  • మైక్రో టెక్స్ట్‌
  • డ్యూయల్‌ హిడెన్‌ ఇమేజ్‌
  • వాటర్‌మార్క్‌
  • అదృశ్య యూవీ లోగో
  • ఎన్‌క్రిప్టెడ్‌ క్యూఆర్‌ కోడ్‌
  • గిల్లోష్‌ ప్యాటర్న్‌
సంతకంతో ధ్రువీకరణ

కార్డులో జారీ అధికారి అయిన సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ అధికారిక సంతకాన్ని
పొందుపరుస్తారు. దీంతో కార్డు అధికారికంగా జారీ అయినదా కాదా అనే విషయాన్ని
ధ్రువీకరించేందుకు మరో భద్రతా పొర అందుబాటులో ఉంటుంది.

హోలోగ్రామ్‌.. తాకితే గుర్తించే రిలీఫ్‌ టెక్స్ట్‌

తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో 16×12 మిల్లీమీటర్ల పరిమాణంలో ప్రత్యేక
హోలోగ్రామ్‌ను కార్డుపై ఏర్పాటు చేస్తారు. అలాగే
‘GOVERNMENT OF TELANGANA’ అనే అక్షరాలను పైకి ఉబ్బినట్లుగా
ముద్రిస్తారు. వీటిని తాకడం ద్వారా కూడా గుర్తించవచ్చు. సాధారణ ముద్రణతో ఇలాంటి
రిలీఫ్‌ టెక్స్ట్‌ను నకలు చేయడం కష్టంగా ఉంటుంది.

కంటికి కనిపించని మైక్రో టెక్స్ట్‌

కార్డులో అత్యంత చిన్న అక్షరాలతో మైక్రో టెక్స్ట్‌ను ముద్రిస్తారు. సాధారణంగా
కంటికి స్పష్టంగా కనిపించని ఈ అక్షరాలను పెద్దదిగా చూసినప్పుడు గుర్తించవచ్చు.
సాధారణ ప్రింటింగ్‌ విధానాలతో యథాతథంగా నకలు చేయడం కష్టమయ్యేలా ఈ భద్రతా
అంశాన్ని రూపొందించారు.

రెండు రహస్య గుర్తులు

డ్యూయల్‌ హిడెన్‌ ఇమేజ్‌ విధానంలో ‘GoTG’, ‘ORIGINAL’ అనే గుర్తులను
ఒకదానిపై మరొకటి సూపర్‌ ఇంపోజ్‌ చేసి ముద్రిస్తారు. నిర్దిష్ట కోణంలో చూడటం లేదా
మాగ్నిఫికేషన్‌ ఉపయోగించినప్పుడు మాత్రమే ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో
కార్డు అసలుదనాన్ని నిపుణులు పరిశీలించేందుకు వీలవుతుంది.

వెలుతురులో కనిపించే వాటర్‌మార్క్‌

తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో వాటర్‌మార్క్‌ను కార్డులో పొందుపరుస్తారు. సాధారణంగా
ఇది అంతగా కనిపించదు. కార్డును వెలుతురుకు ఎదురుగా ఉంచినప్పుడు వాటర్‌మార్క్‌
స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అసలైన కార్డును గుర్తించడానికి మరో అవకాశం లభిస్తుంది.

యూవీ లైట్‌తో అదృశ్య లోగో గుర్తింపు

కార్డులో తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో అదృశ్య యూవీ లోగోను కూడా పొందుపరుస్తారు.
సాధారణ కాంతిలో కనిపించని ఈ గుర్తు అల్ట్రావయొలెట్‌ కాంతిలో కనిపిస్తుంది.
అధికారిక తనిఖీల సమయంలో కార్డు నిజమైనదా కాదా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఎన్‌క్రిప్టెడ్‌ క్యూఆర్‌ కోడ్‌

కార్డు వెనుక భాగంలో ఎన్‌క్రిప్టెడ్‌ క్యూఆర్‌ కోడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
భద్రతతో కూడిన ఈ కోడ్‌ ద్వారా కార్డు వివరాల ధ్రువీకరణకు అవకాశం ఉంటుంది.
సాధారణంగా కనిపించే క్యూఆర్‌ కోడ్‌లకు భిన్నంగా దీనిని భద్రతను దృష్టిలో
ఉంచుకుని రూపొందించారు.

గిల్లోష్‌ ప్యాటర్న్‌

కార్డు ముద్రణలో ప్రత్యేకమైన గిల్లోష్‌ ప్యాటర్న్‌ను ఉపయోగిస్తున్నారు. సన్నని,
సంక్లిష్టమైన గీతలతో రూపొందించే ఈ నమూనాను సాధారణ ప్రింటింగ్‌ పద్ధతుల్లో
కచ్చితంగా పునరుత్పత్తి చేయడం కష్టం. దీంతో కార్డు నకిలీ తయారీకి మరింత
అడ్డుకట్ట పడనుంది.

నకిలీ కార్డులకు అడ్డుకట్ట

సంతకం నుంచి హోలోగ్రామ్‌, రిలీఫ్‌ టెక్స్ట్‌, మైక్రో టెక్స్ట్‌, హిడెన్‌ ఇమేజ్‌,
వాటర్‌మార్క్‌, యూవీ లోగో, ఎన్‌క్రిప్టెడ్‌ క్యూఆర్‌ కోడ్‌, గిల్లోష్‌ ప్యాటర్న్‌
వరకు పలు స్థాయిల భద్రతను కల్పించడం ద్వారా కొత్త ఆహార భద్రత కార్డులను నకలు
చేయడం మరింత కష్టతరం కానుంది.

కార్డు అసలుదనాన్ని వివిధ పద్ధతుల్లో తనిఖీ చేసే అవకాశం ఉండటంతో ప్రజా పంపిణీ
వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు
మరింత పారదర్శకంగా అందేలా ఈ భద్రతా చర్యలు ఉపయోగపడనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!