📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఎంఎస్‌ఎంఈలకు వేగంగా బకాయిల చెల్లింపులు.. సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం

ఎంఎస్‌ఎంఈలకు వేగంగా బకాయిల చెల్లింపులు.. సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం

చర్చకు అవకాశం లేకుండానే లోక్‌సభలో పాస్‌.. ఆందోళనలతో ఉభయ సభల్లో కొనసాగిన ప్రతిష్టంభన..

న్యూఢిల్లీ, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి): చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) రావాల్సిన బకాయిల చెల్లింపులను వేగవంతం చేయడం, నగదు లభ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా తీసుకొచ్చిన ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ (సవరణ) బిల్లు–2026కు పార్లమెంట్‌ ఆమోదం లభించింది. ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా లోక్‌సభలో బిల్లుపై చర్చ జరగకుండానే శుక్రవారం ఆమోదించారు. రాజ్యసభ ఆగస్టు 3నే బిల్లును ఆమోదించింది.

బకాయిలపై వేగంగా పరిష్కారం

ఎంఎస్‌ఎంఈలకు బకాయిల చెల్లింపుల్లో జాప్యం కారణంగా వ్యాపారాల నగదు ప్రవాహంపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో వివాదాల పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితులు విధించారు. సెటిల్‌మెంట్‌ ఒప్పందాలను అమలు చేయడానికి మరింత బలమైన విధానం కల్పించడంతో పాటు, ఎంఎస్‌ఎంఈలకు అనుకూలంగా వచ్చిన మధ్యవర్తిత్వ తీర్పుల అమలును వేగవంతం చేసే నిబంధనలు తీసుకొచ్చారు.

చెల్లింపుల వివాదాల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, సెటిల్‌మెంట్‌ మొత్తాలను బకాయిలుగా రికవరీ చేసుకునే విధానాన్ని బలోపేతం చేయనున్నారు. వివాదంపై అప్పీల్‌ లేదా తీర్పును రద్దు చేయాలన్న దరఖాస్తు ఆరు నెలలకు మించి పెండింగ్‌లో ఉంటే, సంబంధిత మొత్తంలో కనీసం 50 శాతాన్ని ఎంఎస్‌ఎంఈ సరఫరాదారులకు చెల్లించేలా కోర్టులకు అధికారం కల్పించారు.

టీఆర్‌ఈడీఎస్‌ ద్వారా చెల్లింపులు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎంఎస్‌ఎంఈల నుంచి చేసిన కొనుగోళ్లకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లను ట్రేడ్‌ రిసీవబుల్స్‌ డిస్కౌంటింగ్‌ సిస్టమ్‌ (టీఆర్‌ఈడీఎస్‌) ద్వారా చెల్లించే విధానాన్ని బలోపేతం చేయడం ద్వారా చిన్న పరిశ్రమలకు వేగంగా నిధులు అందేలా చర్యలు తీసుకున్నారు. డిజిటల్‌ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో ఎంఎస్‌ఎంఈల నమోదు, చెల్లింపుల వ్యవస్థను మరింత సులభతరం చేయడంపైనా బిల్లు దృష్టి పెట్టింది.

చిన్న తప్పులకు క్రిమినల్‌ కేసులు ఉండవు

ఎంఎస్‌ఎంఈల చిన్నపాటి రిజిస్ట్రేషన్‌, రిపోర్టింగ్‌ లోపాలను క్రిమినల్‌ నేరాల పరిధి నుంచి తప్పించి గ్రేడెడ్‌ పరిపాలనా జరిమానాల విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో చిన్నపాటి నిబంధనల ఉల్లంఘనలకు తీవ్రమైన క్రిమినల్‌ చర్యలకు బదులుగా ఆర్థిక జరిమానాలు, హెచ్చరికలతో వ్యవహరించే అవకాశం ఉంటుంది.

ఆర్థిక వ్యవస్థలో కీలక రంగం

దేశ జీడీపీలో ఎంఎస్‌ఎంఈ రంగం 31 శాతం, తయారీ రంగంలో 36 శాతం, ఎగుమతుల్లో 41 శాతం వాటా కలిగి ఉంది. ఎంఎస్‌ఎంఈలకు అందుతున్న బకాయి రుణాల మొత్తం 2014–15లో రూ.10 లక్షల కోట్ల నుంచి ప్రస్తుతం రూ.38.35 లక్షల కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర మంత్రి జితన్‌రామ్‌ మాంఝీ తెలిపారు.

పార్లమెంట్‌లో కొనసాగిన ప్రతిష్టంభన

మరోవైపు నీట్‌ పేపర్‌ లీక్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసుల చర్యలపై హోంమంత్రి అమిత్‌ షా సమాధానం ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై కూడా చర్చకు డిమాండ్‌ చేశాయి. నిరసనల కారణంగా లోక్‌సభలో జీరో అవర్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే ముగిసింది. రాజ్యసభలోనూ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.

ప్రతిపక్షాలు ఏ మంత్రి సభకు వచ్చి సమాధానం చెప్పాలో నిర్ణయించలేవని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. అమిత్‌ షా సరైన సమయంలో సభలో సమాధానం ఇస్తారని తెలిపారు. చివరకు ఉభయ సభలను సోమవారానికి వాయిదా వేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!