📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్49 మంది సైబర్‌ నేరగాళ్ల అరెస్ట్‌.. రూ.99 లక్షలు స్వాధీనం ..

49 మంది సైబర్‌ నేరగాళ్ల అరెస్ట్‌.. రూ.99 లక్షలు స్వాధీనం ..

15 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు.. ట్రేడింగ్‌ మోసాలే అధికం

హైదరాబాద్, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి): అంతర్రాష్ట్ర సైబర్‌ మోసాల ముఠాపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు భారీ దాడులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో చేపట్టిన ఆపరేషన్లలో 49 మంది నిందితులను అరెస్టు చేసి రూ.99 లక్షలు రికవరీ చేశారు. ట్రేడింగ్‌ మోసాలు, డిజిటల్‌ అరెస్ట్‌, వాట్సాప్‌ ఇంపర్సనేషన్‌, నకిలీ పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలపై ఈ చర్యలు చేపట్టారు.

15 రాష్ట్రాల్లో ఆపరేషన్‌

జాతీయ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (NCRP)లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా జూలైలో ఈ దాడులు జరిగాయి. 25 ప్రధాన సైబర్‌ క్రైమ్‌ కేసులకు సంబంధించి 70 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అరెస్టయిన వారిలో 29 మంది ట్రేడింగ్‌ మోసాలకు, ఐదుగురు సోషల్‌ మీడియా మోసాలకు పాల్పడినవారు ఉన్నారు. డిజిటల్‌ అరెస్ట్‌, వాట్సాప్‌ డీపీ మోసాల్లో ముగ్గురేసి, మ్యాట్రిమోనియల్‌ మోసాల్లో ఇద్దరు, ఏపీకే, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌, పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన ఒక్కొక్కరు ఉన్నారు.

భారీగా వస్తువుల స్వాధీనం

నిందితుల నుంచి 25 డెబిట్‌ కార్డులు, 23 మొబైల్‌ ఫోన్లు, 9 చెక్‌బుక్‌లు, 7 పాస్‌బుక్‌లు, 5 రబ్బర్‌ స్టాంపులు, 3 ల్యాప్‌టాప్‌లు, 2 పాన్‌కార్డులు, 2 అద్దె ఒప్పందాలు, యూఏఈ రెసిడెంట్‌ ఐడీ, క్రెడిట్‌ కార్డు, పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు.

జూలైలో రూ.13.87 కోట్ల నష్టం

జూలైలో సైబర్‌ మోసాలకు సంబంధించి 38 కేసుల్లో బాధితులు రూ.13.87 కోట్లను నష్టపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో రూ.98.89 లక్షలు రికవరీ చేసి బాధితులకు తిరిగి చెల్లించారు. ట్రేడింగ్‌ మోసాల్లోనే రూ.11.75 కోట్ల నష్టం జరగగా, రూ.58.23 లక్షలు రికవరీ చేశారు.

హైదరాబాద్‌లో 2,059 ఫిర్యాదులు

హైదరాబాద్‌లోని జోనల్‌ సైబర్‌ సెల్‌లకు జూలైలో 2,059 ఫిర్యాదులు అందగా 298 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఐదు కేసుల్లో ఆరుగురిని అరెస్టు చేసి రూ.27.09 లక్షలు రికవరీ చేశారు. నకిలీ పెట్టుబడి పథకాలకు ప్రచారం చేస్తున్న 128 ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైళ్లతో పాటు 36 చెల్లింపు ప్రకటనలను కూడా పోలీసులు బ్లాక్‌ చేశారు.

రూ.25 లక్షల వాట్సాప్‌ హ్యాకింగ్‌ కేసు ఛేదన

భూమి బయో ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందిన వాట్సాప్‌ ఖాతాను హ్యాక్‌ చేసి రూ.25 లక్షలను ఆర్‌టీజీఎస్‌ ద్వారా మళ్లించిన కేసులో బిహార్‌కు చెందిన అభినందన్‌ కుమార్‌ కామత్‌ (30)ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రెండు మొబైల్‌ ఫోన్లు, మూడు డెబిట్‌ కార్డులు, నాలుగు పాస్‌బుక్‌లు, రెండు రబ్బర్‌ స్టాంపులు, రెండు పాన్‌కార్డులు, రెండు అద్దె ఒప్పందాలను స్వాధీనం చేసుకున్నారు.

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ మోసాలకు గురైన వారు వెంటనే 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. బ్యాంకులు ఎప్పుడూ ఏపీకే ఫైళ్లను పంపవని, ‘డిజిటల్‌ అరెస్ట్‌’ పేరుతో చట్టపరమైన విధానం ఏదీ లేదని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో వచ్చే అనధికారిక పెట్టుబడి గ్రూపులను నమ్మవద్దని, సెబీ అనుమతి ఉన్న పెట్టుబడి వేదికలను మాత్రమే వినియోగించాలని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!