📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఖాళీ స్థలమా.. కెమికల్‌ డంపింగ్‌ జోన్‌నా?

ఖాళీ స్థలమా.. కెమికల్‌ డంపింగ్‌ జోన్‌నా?

జీడిమెట్లలో వ్యర్థాల కుప్పలు.. పీసీబీ పర్యవేక్షణపై ప్రశ్నలు

కుత్బుల్లాపూర్, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి): జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఖాళీ స్థలాలు, నాళాలు కెమికల్‌ వ్యర్థాల డంపింగ్‌ ప్రాంతాలుగా మారుతున్నాయన్న ఆరోపణలు స్థానికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వివిధ రకాల వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సబ్‌స్టేషన్‌ పక్కనే వ్యర్థాల కుప్పలు

ఎస్వీ కో-ఆపరేటివ్‌ పరిధిలోని ఠాగూర్‌ కెమికల్‌ కంపెనీ సమీపంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పక్కనే కెమికల్‌ వ్యర్థాలు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యర్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు అక్కడికి తరలించారు? వాటి స్వభావం ఏమిటి? వాటిని తొలగించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.

పీసీబీ తనిఖీలు ఎక్కడ?

పారిశ్రామిక ప్రాంతాల్లో వ్యర్థాల అక్రమ పారబోతపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. ఎస్వీ కో-ఆపరేటివ్‌ పరిధిలోని ప్రాంతాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నాయా? నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

వ్యర్థాల మూలంపై విచారణకు డిమాండ్‌

సబ్‌స్టేషన్‌ సమీపంలో ఉన్న వ్యర్థాలు ఏ పరిశ్రమకు చెందినవి? వాటిని ఎవరు తరలించారు? నిబంధనల ప్రకారం నిల్వ చేసి తరలిస్తున్నారా? అనే అంశాలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అవసరమైతే వ్యర్థాల నమూనాలను సేకరించి వాటి స్వభావాన్ని నిర్ధారించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?

కెమికల్‌ వ్యర్థాల స్వభావం తెలియకుండా బహిరంగ ప్రదేశాల్లో పడేయడం వల్ల పర్యావరణం, ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థాలు ప్రమాదకరమైనవిగా తేలితే అగ్ని ప్రమాదం, విషవాయువుల విడుదల వంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ఇప్పటికైనా పీసీబీ, ఎస్వీ కో-ఆపరేటివ్‌ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనల ఉల్లంఘన తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఇప్పటికే పేరుకుపోయిన వ్యర్థాలను నిబంధనల ప్రకారం సురక్షితంగా తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!