ఎగ్‌ల్ ఫోర్స్, ఎల్బీనగర్ పోలీసుల వలలో మహిళ.. రూ.3 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
హైదరాబాద్, ఆగస్టు 10 (నవజ్యోతి ప్రతినిధి): ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలించి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఎగ్‌ల్ ఫోర్స్, ఎల్బీనగర్ పోలీసులు రట్టు చేశారు. ఎల్బీనగర్లో గంజాయి చేతులు మారుతున్న సమయంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు చెందిన సునీత నాగ్ (30) ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాకు చెందిన తన బంధువు లక్షణ్ వద్ద గంజాయి తీసుకుని హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కిలో రూ.3,500కు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో సుమారు రూ.14 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. సునీత ప్రతి నెలా బస్సులో హైదరాబాద్‌కు వచ్చి గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆగస్టు 9న లక్షణ్ నుంచి 6 కిలోల గంజాయి తీసుకున్న సునీత.. పోజ్జా దిర్డో సహాయంతో హైదరాబాద్‌కు చేరుకుంది. ఆగస్టు 10న తెల్లవారుజామున ఎల్బీనగర్కు చేరుకుని వినియోగదారుడు సత్యకు సమాచారం ఇచ్చింది. సత్య మరో ముగ్గురితో కలిసి కారులో అక్కడికి వచ్చాడు. గంజాయి చేతులు మారుతున్న సమయంలో పోలీసులు దాడి చేసి సునీత, పోజ్జా దిర్డో, రిసీవర్ మంచాల రాజేశ్ (27)ను పట్టుకున్నారు.
ఈ కేసులో లక్షణ్, సత్య అలియాస్ సత్తి, మల్లేశ్, శివశంకర్ పరారీలో ఉన్నారు. వంగూర్, కల్వకుర్తి ప్రాంతాల్లో గంజాయి వినియోగదారులుగా భావిస్తున్న ఆరుగురిని పోలీసులు గుర్తించారు. ముఠా వెనుక ఉన్న సరఫరాదారులు, విక్రేతలు, వినియోగదారులు, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది.
పోజ్జా దిర్డోపై గతంలోనూ ఎన్డీపీఎస్ కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2025లో రాయ్‌పూర్ బస్‌స్టాండ్‌లో 10 కిలోల గంజాయితో అతడిని పట్టుకున్నట్లు వెల్లడించారు.
యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎగ్‌ల్ ఫోర్స్ సూచించింది. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని 1908 టోల్‌ఫ్రీ నంబర్‌కు లేదా 87126 71111 వాట్సాప్ నంబర్‌కు తెలియజేయాలని కోరింది. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.

