📄 ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తల్లి పాలే శిశువుకు తొలి టీకా.. ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను విజయవంతం చేయాలి !

తల్లి పాలే శిశువుకు తొలి టీకా.. ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను విజయవంతం చేయాలి !

పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించాలి.. తొలి ఆరు నెలలు తల్లిపాలే ఇవ్వాలి: మంత్రి సీతక్క…

ప్రపంచ తల్లి పాల వారోత్సవాల (ఆగస్టు 1–7) సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రతి తల్లి, ప్రతి కుటుంబానికి తల్లిపాల ప్రాముఖ్యతను చేరవేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు.

తల్లి పాలు ప్రతి శిశువుకు తొలి హక్కు, ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ పోషకాహారమని మంత్రి పేర్కొన్నారు. పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు శిశువుకు తొలి రోగనిరోధక టీకాలా పనిచేస్తాయని తెలిపారు. ప్రతి శిశువుకు పుట్టిన గంటలోపే తల్లిపాలను ప్రారంభించాలని, తొలి ఆరు నెలలు కేవలం తల్లిపాలే ఇవ్వాలని సూచించారు. అనంతరం వయస్సుకు తగిన అనుబంధ ఆహారంతో పాటు రెండేళ్ల వరకు తల్లిపాలను కొనసాగించడం వల్ల పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు బలమైన పునాది ఏర్పడుతుందని చెప్పారు.

తల్లి పాల వారోత్సవాలను కేవలం అధికారిక కార్యక్రమాలుగా కాకుండా ప్రజల్లో చైతన్యం కలిగించే ఉద్యమంగా నిర్వహించాలని మంత్రి సీతక్క సూచించారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాలు, వార్డుల్లో అవగాహన సమావేశాలు, ఇంటింటి సందర్శనలు, కమ్యూనిటీ కార్యక్రమాలు నిర్వహించి తల్లిపాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, సూపర్వైజర్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించి గర్భిణీలు, బాలింతలు, ఆరు నెలల లోపు శిశువుల తల్లులు, రెండేళ్ల లోపు పిల్లల తల్లులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగిస్తూ శాస్త్రీయ అవగాహన కల్పించాలని, కుటుంబ సభ్యులను కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని కోరారు.

ప్రసవం జరిగిన ప్రతి ఆసుపత్రిలో పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు అందేలా వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. తల్లి పాల ప్రోత్సాహంలో అంగన్వాడీ వ్యవస్థ కీలక పాత్ర పోషించాలని, ప్రతి అంగన్వాడీ కేంద్రం తల్లి-శిశు ఆరోగ్యానికి మార్గదర్శక కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. పోషకాహార లోపం లేని తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి శిశువుకు ఆరోగ్యవంతమైన జీవితానికి తల్లి పాలే బలమైన పునాది అని మంత్రి పేర్కొన్నారు.

ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను విజయవంతం చేయడంలో ప్రజాప్రతినిధులు, వైద్యులు, మహిళా సంఘాలు, అంగన్వాడీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ప్రతి తల్లి తన బిడ్డకు తల్లిపాలు అందించేలా సమాజమంతా బాధ్యతతో ముందుకు రావాలని కోరారు.

© 2026 నవజ్యోతి తెలుగు దినపత్రిక. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!