📄 ePaper
Friday, October 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల పరిశీలన.. ఐదు పంపులతో మిడ్ మానేర్‌కు నీటి తరలింపు ప్రారంభం..

ఉత్తర తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గోదావరిలో ఈ సీజన్‌లో తొలి భారీ వరద ప్రవాహాలు చేరిన నేపథ్యంలో శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ), కడెం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులను శనివారం పరిశీలించారు.

మంత్రి డి. శ్రీధర్ బాబు, జి. వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్టుల్లోకి వస్తున్న నీటి ప్రవాహాలు, నిల్వలు, పంపింగ్ కార్యకలాపాలను సమీక్షించారు. ఎల్లంపల్లి వద్ద ఐదు పంపులను ప్రారంభించి ఫ్లడ్ ఫ్లో కాలువ ద్వారా మిడ్ మానేర్‌కు నీటిని తరలిస్తున్నట్లు తెలిపారు. గోదావరి జలాల్లో ఒక్క చుక్క కూడా వృథా కాకుండా గంట గంటకూ పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

ఎల్లంపల్లి నుంచి తరలిస్తున్న నీటిని “కాళేశ్వరం నీరు”గా ప్రచారం చేయడం సరికాదని మంత్రి స్పష్టం చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో ప్రతిపాదించిన ప్రాణహిత-చెవెళ్ల ప్రాజెక్టులో భాగమని, ప్రస్తుతం వస్తున్నది గోదావరి సహజ ప్రవాహమే తప్ప కాళేశ్వరం బ్యారేజీల నుంచి ఎత్తిపోసిన నీరు కాదన్నారు.

జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన శ్రీరాంసాగర్, కడెం, నాగార్జునసాగర్, శ్రీశైలం, ఫ్లడ్ ఫ్లో కాలువ వంటి కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ రాష్ట్రానికి విశ్వసనీయంగా సేవలందిస్తున్నాయని చెప్పారు. మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మాణ లోపాల కారణంగా సమస్యలు ఎదుర్కొన్నాయని విమర్శించారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటి నిల్వలు చేపట్టకపోవడానికి ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (NDSA), కేంద్ర జల సంఘం (CWC) సూచనల మేరకే ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఐఐటీ బాంబే, AFRY ఇండియా నిపుణులు పునరుద్ధరణ నమూనాలను సిద్ధం చేస్తున్నారని, వాటి ఆధారంగా శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతులు చేపట్టి వచ్చే వర్షాకాలానికి ముందే బ్యారేజీలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

కన్నెపల్లి పంపులను ప్రస్తుతం ప్రారంభించలేమని మంత్రి తెలిపారు. అక్కడి నుంచి ఎత్తిపోసిన నీటిని అన్నారం, సుందిళ్లలో నిల్వ చేయాల్సి ఉంటుందని, ఆయా బ్యారేజీల్లో నిర్మాణ భద్రతా పరిశీలనలు కొనసాగుతున్నందున నిపుణుల సూచనలు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుందని చెప్పారు.

గత ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఆశించిన మేర కొత్త ఆయకట్టు సృష్టించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. దెబ్బతిన్న బ్యారేజీల నుంచి నీటిని వినియోగించకుండానే తెలంగాణలో ఏటా సుమారు 300 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి నమోదైందని, ఇటీవల 152 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో సుమారు రూ.80 వేల కోట్లు జమ చేసిందన్నారు.

ఉత్తర తెలంగాణ రైతులకు సాగు, తాగునీటి అవసరాల కోసం గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు.

© 2026 నవజ్యోతి తెలుగు దినపత్రిక. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!