రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మహమ్మద్ అలీ షబ్బీర్
కామారెడ్డి, ఆగస్టు 27 (నవజ్యోతి ప్రతినిధి):
మాచారెడ్డి, అంతంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. మాచారెడ్డి పీఏసీఎస్ చైర్మన్‌గా నౌసిలాల్ నాయక్, అంతంపల్లి పీఏసీఎస్ చైర్మన్‌గా చిట్టెడి సుధాకర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, పాలకవర్గ సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు. రెండు కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నూతన పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. రైతు ఆర్థికంగా బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని తెలిపారు. పంట రుణాలు, విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ సేవలు సకాలంలో అందించడంలో పీఏసీఎస్‌లు కీలకపాత్ర పోషించాలని సూచించారు. రైతు భరోసా, పంట రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు బీమా, సాగునీటి వనరుల అభివృద్ధి వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
రైతులకు సమానంగా సేవలు
పీఏసీఎస్‌లు కేవలం రుణాలు అందించే సంస్థలుగా కాకుండా రైతుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడే కేంద్రాలుగా పనిచేయాలని సూచించారు. నూతన చైర్మన్లు రాజకీయాలకు అతీతంగా ప్రతి రైతుకు సమానంగా సేవలందించి, పీఏసీఎస్‌లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పాలకవర్గాలతో కలిసి కృషి చేయాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
పాల్గొన్న నాయకులు, ప్రజాప్రతినిధులు
మాచారెడ్డి, అంతంపల్లి కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ సురేష్ నర్సింగరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, మాచారెడ్డి సర్పంచ్ సంతోష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, అంతంపల్లి సర్పంచ్ మంజుల సంజీవరెడ్డి, లింగారెడ్డి, బిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, తిప్పాపూర్ సొసైటీ చైర్మన్ భీంరెడ్డి, కామారెడ్డి సొసైటీ చైర్మన్ గూడెం శ్రీనివాస్‌రెడ్డి, చుక్కాపూర్ లక్ష్మీనర్సింహ ఆలయ చైర్మన్ కమలాకర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, సుదర్శన్, కౌన్సిలర్ మోతిలాల్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు భూమని బాలరాజ్, తాటిపాముల లింబాద్రి, డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్, ప్రవీణ్‌రెడ్డి, శ్రీకాంత్, యాదవ్‌రెడ్డి, కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సందీప్ తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
అనంతరం అంతంపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.

