📄 ePaper
Thursday, August 27, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తెలంగాణలో ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. ఈ-ఆటోకు రూ.1.50 లక్షల సాయం !

తెలంగాణలో ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. ఈ-ఆటోకు రూ.1.50 లక్షల సాయం !

18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలకు ఎలక్ట్రిక్‌ మార్పిడి.. రూ.200 కోట్ల పథకం

హైదరాబాద్, ఆగస్టు 27 (నవజ్యోతి ప్రతినిధి): తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌ ఆటోలను ఎలక్ట్రిక్‌ ఆటోలుగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్‌ కన్వర్షన్‌ స్కీమ్‌–2026’కు రవాణా, రోడ్లు భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర బడ్జెట్‌ నుంచి సంక్షేమ శాఖల ద్వారా మొత్తం రూ.200 కోట్లను కేటాయించనున్నారు.

కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (CURE) పరిధిలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌తో నడుస్తున్న 18,766 ఆటోలను 100 శాతం ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చడం ఈ పథకం లక్ష్యం. ఇందులో 11,254 డీజిల్‌ ఆటోలు, 7,512 పెట్రోల్‌ ఆటోలు ఉన్నాయి.

రెండు ఆప్షన్లు.. రూ.1.50 లక్షల వరకు సాయం

ప్రస్తుత ఆటోనే కొనసాగించాలనుకునే డ్రైవర్లు AIS-123 ఆమోదం పొందిన ఎలక్ట్రిక్‌ కిట్‌తో రీట్రోఫిట్‌ చేసుకోవచ్చు. ఇందుకు కిట్‌ ఖర్చు లేదా గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. ఫిక్స్‌డ్‌ బ్యాటరీ లేదా స్వాపబుల్‌ బ్యాటరీ కిట్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.

పాత పెట్రోల్/డీజిల్‌ ఆటోను అప్పగించి కొత్త ఎలక్ట్రిక్‌ ఆటో తీసుకునే వారికి కూడా రూ.1.50 లక్షల ఫ్లాట్‌ సబ్సిడీ ఇవ్వనున్నారు. ఎంపిక చేసిన మోడల్‌ ఆన్‌రోడ్‌ ధరలో ఈ మొత్తాన్ని ఎన్‌ప్యానెల్డ్‌ డీలర్లు ముందుగానే సర్దుబాటు చేయనున్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రత్యేక నిధులు

ఈ పథకానికి కేటాయించిన రూ.200 కోట్లను నాలుగు సంక్షేమ శాఖలకు చెరో రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు.

  • ఎస్సీ అభివృద్ధి శాఖ – రూ.50 కోట్లు
  • ఎస్టీ అభివృద్ధి శాఖ – రూ.50 కోట్లు
  • బీసీ సంక్షేమ శాఖ – రూ.50 కోట్లు
  • మైనారిటీల సంక్షేమ శాఖ – రూ.50 కోట్లు

సామాజిక వర్గంతో సంబంధం లేకుండా CURE పరిధిలోని అర్హత కలిగిన ఆటో యజమానులకు పథకం వర్తించేలా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది.

కాలుష్యానికి చెక్.. డ్రైవర్లపై ఇంధన భారం తగ్గే అవకాశం

పెట్రోల్, డీజిల్‌ ఆటోలు నగరాల్లో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. అదే సమయంలో పెరుగుతున్న ఇంధన ధరలు ఆటో డ్రైవర్ల ఆదాయంపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ ఆటోల వైపు మార్పును వేగవంతం చేయాలని నిర్ణయించింది.

పథకం అమలుకు రవాణా కమిషనర్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరించనున్నారు. ఆయా సంక్షేమ శాఖలు నిధులను దశలవారీగా విడుదల చేయనున్నాయి.

దీంతో CURE పరిధిలోని 18,766 పెట్రోల్, డీజిల్‌ ఆటోలను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చర్యలు ప్రారంభించినట్లైంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!