రెండు మృతదేహాలకు పోస్ట్‌మార్టం ఆలస్యం.. ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
ఉదయం ప్రమాదం.. రాత్రి 8 గంటలైనా పోస్ట్‌మార్టం చేయని పరిస్థితి
సంగారెడ్డి జిల్లా, ఆగస్టు 27 (నవజ్యోతి ప్రతినిధి):
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రెండు మృతదేహాలకు పోస్ట్‌మార్టం ఆలస్యమైంది. కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామం వద్ద ఉదయం 10:30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అయితే రాత్రి 8 గంటలైనా పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
డ్యూటీ డాక్టర్ కూడా అందుబాటులో లేరని ఆరోపణ
జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్, సూపరింటెండెంట్, ఆర్‌ఎంవో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాధితులు ఆరోపించారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా వైద్యులు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నష్టపరిహారం కోసం ధర్నా
సజ్జాపూర్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు డీసీఎం యజమాని నుంచి నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ బంధువులు జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం జహీరాబాద్ పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట కూడా ఆందోళన చేపట్టారు.
ధర్నాతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి సంబంధించి కోహిర్ ఎస్‌ఐ కేసు నమోదు చేయడం లేదని బాధితులు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.
‘దళితుల ప్రాణాలకు విలువ లేదా?’
తమ కుటుంబ సభ్యులను కోల్పోయి బాధలో ఉన్న తమకు న్యాయం చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘దళితుల ప్రాణాలు అంటే లెక్క లేదా?’ అంటూ ప్రశ్నించారు. కోహిర్ ఎస్‌ఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జహీరాబాద్ పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా కొనసాగించారు.

