📄 ePaper
Thursday, August 27, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తుమ్మిడిహట్టి బ్యారేజీపై 2 రాష్ట్రాల కీలక భేటీ

తుమ్మిడిహట్టి బ్యారేజీపై 2 రాష్ట్రాల కీలక భేటీ

సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో సమావేశం

152 మీటర్ల ఎత్తుకు తెలంగాణ పట్టుబాటు.. కేంద్రం జోక్యంతో ముందుకు కదులుతున్న ప్రక్రియ

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌రెడ్డి నిరంతర ప్రయత్నాల నేపథ్యంలో ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.

కేంద్ర జల సంఘం (CWC) చైర్మన్‌ అధ్యక్షతన సేవా భవన్‌లో జరిగే సమావేశానికి తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలపై చర్చించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే మార్గాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

మహారాష్ట్రతో అంగీకారానికి ప్రయత్నాలు

తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రెండు రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేసి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని కోరారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ప్రధానమంత్రి కార్యాలయం జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపించింది.

అనంతరం ఆగస్టు 5న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా లేఖ రాసి కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. దీంతో సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో చర్చలకు మార్గం ఏర్పడింది.

152 మీటర్ల ఎత్తుపై తెలంగాణ వాదన

గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్ల ఎత్తుకు బదులుగా 152 మీటర్ల ఎత్తు ఉండేలా అంగీకారం సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 148 మీటర్ల వద్ద అవసరమైన నీటిని గ్రావిటీ ద్వారా తరలించడం సాధ్యం కాదని, భారీ పంపులను వినియోగిస్తే విద్యుత్‌ వ్యయం గణనీయంగా పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించింది.

తక్కువ విద్యుత్‌ వ్యయంతో దీర్ఘకాలికంగా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ప్రాజెక్టును నిర్మించాలన్నదే తెలంగాణ ప్రధాన వాదన. సీడబ్లూపీఆర్‌ఎస్‌ అధ్యయనాల ప్రకారం జలమట్టాన్ని పెంచడం వల్ల అదనపు ముంపు పరిమితంగానే ఉంటుందని కూడా కేంద్రానికి నివేదించింది.

కరవు ప్రాంతాలకు సాగునీరు

వెనుకబడిన, కరవు ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు అందించే తుమ్మిడిహట్టి ప్రాజెక్టును త్వరగా కార్యరూపంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రం, మహారాష్ట్రతో వరుసగా సంప్రదింపులు కొనసాగిస్తోంది. సెప్టెంబర్‌ 1న జరిగే సమావేశం ప్రాజెక్టు భవిష్యత్‌ కార్యాచరణలో కీలకంగా మారనుంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!